భారీ పోలింగ్‌.. ఇద్ద‌రి చంద్రుళ్ల‌లో షాక్ ఎవ‌రికి?

Update: 2018-12-09 04:57 GMT
తెలంగాణ ఓట‌రు తీర్పు న‌రాలు తెగే ఉత్కంట‌గా మారింది. ముందుగా ఊహించిన‌ట్లే భారీ ఎత్తున పోలింగ్ జ‌రిగింది. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రం మిన‌హా.. తెలంగాణ వ్యాప్తంగా ఓట‌రు చైత‌న్యం వెల్లివిరిసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత భారీ పోలింగ్ దేనికి నిద‌ర్శ‌నం?  ఎవ‌రికి షాకింగ్ గా మార‌నుంది? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

సాధార‌ణంగా ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు భారీ ఎత్తున పోలింగ్ న‌మోదైతే.. అది ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటుగా చెబుతుంటారు. అదే స‌మ‌యంలో ఓటింగ్ త‌క్కువ‌గా జరిగితే అధికార‌ప‌క్షానికి లాభమ‌న్నఅభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంటుంది. ఆస‌క్తిక‌ర‌ అంశం ఏమంటే.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా వినిపించే వాద‌న‌కు భిన్నంగా భారీగా పోలింగ్ జ‌రిగిన తెలంగాణ‌లో.. అధికార‌ప‌క్ష‌మైన టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల‌య్యాయి.

మామూలుగా అయితే.. భారీ పోలింగ్ జ‌రిగిన‌ప్పుడు ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటుగా చెబుతూ.. టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా తీర్పు వ‌స్తుంద‌న్న అంచ‌నాలు వెలువ‌డాలి. కానీ.. అందుకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు రావ‌టం ఇప్పుడు అంద‌రిని అయోమ‌యానికి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే.. రాజ‌కీయ వ‌ర్గాల పరిస్థితి మ‌రింత గంద‌ర‌గోళంగా మారింది. పోలింగ్ శాతం భారీగా న‌మోదు కావ‌టం.. అందుకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఉండ‌టంతో ఓట‌రు తీర్పు ఏమిట‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఎవ‌రికి వారు గెలుపు త‌మ‌దేన‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తున్న వేళ‌.. ఆస‌క్తిక‌ర వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఓటు వేయ‌టం ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో ఎవ‌రికి న‌ష్టం వాటిల్లుతుంద‌న్న అంశంపై తెలంగాణలోని కొన్ని వ‌ర్గాలు చేస్తున్న‌విశ్లేష‌ణ సంతృప్తిక‌రంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

భారీగా పోలింగ్ జ‌రిగిన‌ప్పుడు ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు అన్న‌ది నిజ‌మేన‌ని.. తాజా తెలంగాణ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. భారీగా పోల్ అయిన ఓట్లు అన్ని చంద్ర‌బాబు వ్య‌తిరేక ఓటుగా అభివ‌ర్ణిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కూడా బాబు చ‌క్రం తిప్ప‌టాన్ని స‌హించ‌లేని తెలంగాణ ఓట‌ర్లు త‌మ తీర్పుతో బాబుకు స్ప‌ష్ట‌మైన సందేశాన్ని ఇచ్చి ఉంటార‌న్న‌ది ఆ వ‌ర్గాల వాద‌న‌. ఈ కార‌ణంతోనే భారీ పోలింగ్ వేళ‌.. కేసీఆర్ ప్ర‌భుత్వానికి ప‌డాల్సిన వ్య‌తిరేక ఓటు అంతా మాకొద్దు బాబు అన్న సందేశాన్ని ఇచ్చేలా తెలంగాణ ఓట‌ర్లు తీర్పును ఈవీఎం మెషిన్ల‌లో నిక్షిప్తం చేసి ఉంటార‌ని చెబుతున్నారు. ఈ వాద‌న‌లో నిజం ఎంత‌న్న‌ది రానున్న రెండు రోజుల్లో తెలనుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News