గులాబీ బాస్ మూలాల్ని మిస్ అవుతున్నారే?

Update: 2019-06-29 04:46 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏం చేసినా దానికో ల‌క్ష్యం ఉంటుంది. తాను ప‌ని ప్రారంభించ‌టానికి ముందే.. త‌గిన వాద‌న‌ను సిద్ధం చేసుకుంటారు. భావోద్వేగాన్ని బ‌లంగా వ్యాపించేలా చేస్తారు. అనంత‌రం ఆయ‌న సీన్లోకి వ‌స్తారు. ఆయ‌న నోరు విప్పిన మొద‌లు.. త‌న వాద‌న‌కు ఫిదా అయ్యేలా చేయ‌ట‌మే కాదు.. దాని సాధ‌న బాధ్య‌త మాదంటూ ల‌క్ష‌ల మంది రోడ్ల మీద‌కు వ‌చ్చేలా చేస్తారు. అంతిమంగా తాను అనుకున్న‌ది అయ్యేలా చేయ‌టం టీఆర్ ఎస్ అధినేత‌గా వ్య‌వ‌హ‌రించే కేసీఆర్ ల‌క్ష‌ణంగా చెప్పాలి.

తానేం చేసినా.. తాను నేరుగా ఉండేదాని కంటే కూడా ప్ర‌జ‌లు త‌న వెంట న‌డిచేలా చేసుకుంటూ ఉంటారు. అలాంటి కేసీఆర్ త‌న మూలాల్ని మిస్ అవుతున్నారా?  త‌న బేసిక్స్ లో బ‌ల‌మైన పాయింట్ల‌ను ప‌ట్టించుకోవ‌టం లేదా? అన్న డౌట్లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.

తాజాగా కొత్త అసెంబ్లీ భ‌వ‌నాల ఏర్పాటు మీద హైకోర్టులో జ‌రిగిన వాద‌న‌ల్ని విన్న‌ప్పుడు ప్ర‌భుత్వం త‌ర‌ఫున చేసిన వాద‌న‌లు తేలిపోయాయ‌న్న భావ‌న‌ను ప‌లువురు న్యాయ‌నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి తోడు.. కొత్త అసెంబ్లీ భ‌వ‌నాన్ని నిర్మించే విష‌యంలోనూ తెలంగాణ ప్ర‌జ‌లు సైతం సిద్ధంగా లేర‌న్న అభిప్రాయం అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డుతోంది.

ఉద్య‌మ‌కాలంలో త‌న వెంట న‌డిచిన ప్ర‌జ‌లు.. చేతిలో అధికారం ఉన్న వేళ మిస్ కావ‌టం ఏమిట‌న్న విష‌యం మీద కేసీఆర్ దృష్టి సారిస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అప్ప‌ట్లో తాను కోరుకునేది.. ప్ర‌జ‌లు కోరుకునేది మ్యాచ్ అయ్యేది. ఆయ‌న మాట‌కు మంది బ‌లం తోడ‌య్యేది.ఇప్పుడు అందుకు భిన్నంగా మంది ఆలోచ‌నలు ప్ర‌తిబింబించేలా గులాబీ బాస్ మాట‌లు ఉండ‌టం లేద‌న్న భావ‌న అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

జ‌నం బ‌ల‌మే కేసీఆర్ బ‌లంగా మారిన స్థానం నుంచి.. త‌న బ‌లం మీద‌నే కేసీఆర్ ఎక్కువ‌గా ఆధార‌ప‌డ‌టంతో జ‌నం దూర‌మవుతున్న ప‌రిస్థితి. గులాబీ బాస్ గా వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకున్న కేసీఆర్‌.. ప్ర‌జ‌లను వ‌దిలేసి త‌నను తాను న‌మ్ముకోవ‌టం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోందా? అన్న‌ది ఇప్పుడు క్వ‌శ్చ‌న్ గా మారుతోంది. ఇదే.. ఆయ‌న చేసే ప‌నుల‌కు ప్ర‌జ‌ల నుంచి సానుకూల‌త ల‌భించ‌టం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎంత ప‌వ‌ర్ ఫుల్ అయినా.. ఎంత మొన‌గాడు అయినా త‌న బ‌లంలోని బేసిక్స్ ను మిస్ అయితే ఎలా గులాబీ బాస్?


Tags:    

Similar News