కొత్త గవర్నర్ తో భేటీలు ఉండవా కేసీఆర్?

Update: 2019-10-12 01:30 GMT
తన మాటలతో.. చేతలతో తరచూ వార్తల్లోకే కాదు.. చర్చల్లోనూ లైవ్ లో ఉంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. సుదీర్ఘకాలం తెలుగు నేల మీద గవర్నర్ గా ఉన్న నరసింహన్ తో ఆయనకున్న దగ్గరతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మీద ఉన్న అభిమానంతో ప్రత్యేక విమానంలో ఆయన్ను చెన్నైకి సాగనంపిన వైనాన్ని మర్చిపోలేం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గవర్నర్ గా నరసింహన్ ఉన్న కాలంలో వారానికి..పది రోజులకు ఒకసారి ఆయనతో భేటీ అయ్యేవారు.

దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా గవర్నర్ ను అన్నిసార్లు భేటీ అయ్యే వారు కాదు. అంతేకాదు.. ఒకసారి వారి భేటీ మొదలైతే.. గంటల పాటు సాగుతూనే ఉండేది. తరచూ గవర్నర్ ను భేటీ కావటంపై కేసీఆర్ నేరుగా స్పందించింది లేదు. ఆ విషయాన్నిక్వశ్చన్ రూపంలో మీడియా ప్రతినిధులు అడిగింది లేదు.

కాకుంటే.. సీఎంవో నుంచి వచ్చే ప్రెస్ నోట్లలో మాత్రం.. గవర్నర్ తో మర్యాదపూర్వకంగా భేటీ జరిగిందని.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాల్ని గవర్నర్ కు వివరించినట్లుగా నోట్ పంపేవారు. మరి.. నరసింహన్ గవర్నర్ గా ఉన్న వేళలో.. అదే పనిగా రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్.. తమిళ సై గవర్నర్ గా నియమితులయ్యాక మాత్రం ఎందుకు వెళ్లటం లేదన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.

తమిళ సై ప్రమాణస్వీకారోత్సవానికి.. కేబినెట్ విస్తరణకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత మళ్లీ రాజ్ భవన్ ముఖం చూడలేదు. నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు తరచూ రాజ్ భవన్ కు వెళ్లి.. పాలనా పరమైన అంశాల్ని చర్చించి వచ్చే ముఖ్యమంత్రి.. ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్న వేళ.. గవర్నర్ వద్దకు వెళ్లి ఆ వివరాల్ని ఎందుకు షేర్ చేయనట్లు? అన్నది ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News