కర్ణాట‌క‌- హైద‌రాబాద్ క్యాంప్ వెనుక కేసీఆర్‌

Update: 2018-05-18 06:10 GMT
క‌ర్ణాట‌క రాజ‌కీయాలు రోజుకో కొత్త మ‌లుపు తిరుగూ మెగా డైలీ సీరియ‌ల్ ను మించిపోతున్నాయి. క‌ర్ `నాట‌కం`లో అనూహ్య మ‌లుపులు - ట్విస్టులు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ను త‌ల‌పిస్తున్నాయి. చెప్పిన‌ట్లుగానే నిన్న ప్ర‌మాణ స్వీకారం చేసి త‌న పంతం నెగ్గించుకున్న సీఎం య‌డ్యూర‌ప్ప‌...గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన 15 రోజుల గ‌డువులోపు బ‌ల‌పరీక్ష‌ను ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నారు. అంత‌కుముందుగానే ప్రొటెమ్ స్పీక‌ర్ ఎంపిక రూపంలో య‌డ్డీకి తొలి ప‌రీక్ష ఎదురుకానుంది. త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ - జేడీఎస్ లు ప‌క‌డ్బందీ వ్యూహాలు ర‌చిస్తున్నాయి. క‌న్న‌డనాట ఎమ్మెల్యేల‌ను ఉంచిన ఈగ‌ల్ట‌న్ రిసార్ట్ ముందు పోలీసు సెక్యూరిటీని తొలగించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా, క‌న్న‌డ క్యాంపు రాజ‌కీయాలు హైద‌రాబాద్ కు చేరుకున్నాయి. త‌మ ఎమ్మెల్యేల‌ను బ‌స్సులు - కార్ల‌లో హైద‌రాబాద్ లోని మూడు ప్ర‌ముఖ హోట‌ళ్ల‌కు కాంగ్రెస్ - జేడీఎస్ నేత‌లు త‌ర‌లించారు. జేడీఎస్ కు కేసీఆర్ మ‌ద్ద‌తు తెలిపిన నేప‌థ్యంలోనే క‌న్న‌డ క్యాంపు రాజ‌కీయం భాగ్య‌న‌గ‌రానికి చేరుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. కేసీఆర్ సూచ‌న‌ల ప్ర‌కారమే ఆ ఎమ్మెల్యేల‌ను హైద‌రాబాద్ కు త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. బీజేపీ బేర‌సారాల‌ను కూడా కేసీఆర్ ఓ క‌న్నేసి ఉంచుతార‌ని - అందుకే ఇటొచ్చిన‌ట్లు చెబుతున్నారు.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు ముందు జేడీఎస్ కు కేసీఆర్ మ‌ద్ద‌తు తెలిపిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా, థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విష‌యంలో దేవెగౌడ‌ - కుమార స్వామిల‌తో కూడా కేసీఆర్ చ‌ర్చ‌లు జ‌రిపారు. దానికితోడు, ప్రాంతీయ పార్టీల ముఖ్య‌మంత్రులంతా త‌మ‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని, గ‌వ‌ర్న‌ర్ - బీజేపీల తీరును ఖండించాల‌ని కుమార స్వామి పిలుపునిచ్చారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు - తెలంగాణ సీఎం కేసీఆర్ - ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీలు ఈ విష‌యంలో త‌న‌కు బాస‌ట‌గా నిల‌వాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ సూచ‌న‌ ప్ర‌కారం ఆ ఎమ్మెల్యేలంతా హైద‌రాబాద్ కు చేరిన‌ట్లు తెలుస్తోంది. మాదాపూర్ సమీపంలోని నోవాటెల్ హోటల్ - కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బిరామిరెడ్డికి చెందిన పార్క్ హయత్ హోటల్ ల‌కు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆ  ఎమ్మెల్యేలు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అంత‌కుముందు, బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు ఆ ఎమ్మెల్యేల‌ను తరలించాలని భావించారు. అయితే.. ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వకపోవటంతో బస్సులు..కార్లలో వీరిని త‌ర‌లించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందానికి డీకే శివకుమార్ నేతృత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్.. జేడీఎస్ ఎమ్మెల్యేలకు కావాల్సిన ఏర్పాట్లను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  పర్యవేక్షిస్తున్నారు.
Tags:    

Similar News