రిజర్వేషన్ల పెంపుపై కేసీఆర్ క్లారిటీ

Update: 2017-04-16 07:41 GMT
తెలంగాణ శాసనసభలో  రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్  భావోద్వేగంతో మాట్లాడారు. ఇది ఒక చరిత్రాత్మక సందర్భమని అభివర్ణించారు. రిజర్వేషన్ల పెంపుపై టీఆర్‌ ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికల సందర్భంగా 107 బహిరంగ సభల్లో హామీని ఇచ్చానని ఆయన గుర్తు చేశారు. తానిచ్చిన ఏ హామీ విషయంలోనూ వెనక్కి వెళ్లబోనని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం తాను పోరాడుతున్న వేళ.. తెలంగాణ రాష్ట్రం రాదని,  ఒకవేళ వచ్చినా అనేక ఒడిదుడుకులు ఉంటాయని ఉద్యమసమయంలో అనేక దుష్ర్పచారాలు చేశారని.. అయినా రాష్ట్రం సాధించామని.. ఇప్పుడు రిజర్వేషన్ల పెంపు కూడా చేసి చూపిస్తున్నామని చెప్పారు.
    
ఎన్నికల సభల్లో ఇచ్చిన హామీ మేరకే రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టినట్లు కేసీఆర్ చెప్పారు.  ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గిరిజనులు - బీసీ-ఈ రిజర్వేషన్లు కొత్తవేం కాదు.. గతంలో ఉన్నవే అని చెప్పారు. బీసీ కమిషన్ నివేదిక ప్రకారం బీసీ-ఈ వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పెంపుతో బీసీలకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు.
    
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులు 6 శాతం ఉండేవారని..  విభజన తర్వాత తెలంగాణ రాష్ర్టంలో 9.08 శాతం మంది గిరిజనులు ఉన్నారని..  వాల్మీకి బోయలను ఎస్టీల్లో కలపడంతో గిరిజనుల శాతం 10కి పెరిగిందన్నారు. దళితులకు ఒక శాతం రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు రిజర్వేషన్లూ పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బీసీల రిజర్వేషన్ల అంశాన్ని బీసీ కమిషన్ కు అప్పగిస్తామన్నారు. కమిషన్ నివేదిక మేరకు బీసీలకూ రిజర్వేషన్లు పెంచుతామన్నారు.
    
ఒక్కొక్క రాష్ర్టంలో ఒక్కో రకంగా రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని..  50 శాతమే రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. ఈశాన్య రాష్ర్టాల్లో గిరిజనులకు 80 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తు చేశారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని తెలిపారు.  తెలంగాణ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్ లో పెట్టాలన్నారు. కేంద్రం రిజర్వేషన్లు పెంచుకునే అవకాశాన్ని రాష్ర్టాలకు కల్పించాలన్నారు. ఈ నెల 23న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రధాని మోదీకి చెప్తానని చెప్పారు.  కేంద్రం విజ్ఞతతో వ్యవహరించి రిజర్వేషన్ల పెంపు అంశాన్ని రాష్ర్టాలకే వదిలేయాలని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News