ఈశాన్య ఆనందం లేకుండా చేసిన కేసీఆర్‌!

Update: 2018-03-04 08:40 GMT
అన్ని రోజులు ఒక‌లా ఉండ‌వు. కొన్ని రోజులు ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన రోజు.. క‌ళ్ల ముందుకు వ‌చ్చిన వేళ‌.. ఆ సంతోషాన్ని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డితే అంత‌కుమించిన బాధ మ‌రొక‌టి ఉండ‌దు. తాజాగా క‌మ‌ల‌నాథుల‌కు అలాంటి అనుభ‌వాన్నే ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.

ఈశాన్యాన కాషాయ‌జెండాను ఎగుర‌వేయాల‌న్న బీజేపీ నేత‌ల క‌ల ఇప్ప‌టిది కాదు. ఎంత ప్ర‌య‌త్నించినా.. ఎంత‌కూ కొరుకుడుప‌డ‌ని రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాలున్నాయి. ఇప్పుడు ద‌క్షిణాదిన బీజేపీ జెండా ఎగుర‌వేయాల‌న్న త‌ప‌న ఎంత ఎక్కువ‌గా ఉంటుందో.. ఇంచుమించు అలాంటి ప‌రిస్థితే ఈశాన్యాన ఉండేది.

అయితే.. కిందామీదా ప‌డిన బీజేపీ అధినాయ‌క‌త్వం ఎట్ట‌కేల‌కు త‌మకు అంతుచిక్క‌కుండా ఉండే ఈశాన్య రాష్ట్రాల మీద ప‌ట్టు బిగించిన ప‌రిస్థితి. తాజాగా విడుద‌లైన మూడు ఈశాన్య రాష్ట్రాల ఫ‌లితాలు చూస్తే.. ఒక రాష్ట్రంలో బంప‌ర్ మెజార్టీతో విజ‌యాన్ని సాధించ‌ట‌మేకాదు.. ద‌శాబ్దాలుగా క‌మ్యునిస్టుల‌కు కంచుకోట‌గా నిలిచిన త్రిపుర గ‌డ్డ మీద కాషాయ‌జెండాను స‌గ‌ర్వంగా ఎగుర‌వేశారు. మిగిలిన రెండు రాష్ట్రాల్లో హంగ్ ఏర్ప‌డిన‌.. బీజేపీ అధినాయ‌త్వానికి ఉన్న తెలివితేట‌ల‌తో ఆ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవ‌టానికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయాలో అన్ని చేయ‌టం ఖాయం.

ఈశాన్యాన కాషాయ జెండా రెప‌రెప‌లాడుతున్న రోజును ఎంజాయ్ చేస్తున్న క‌మ‌ల‌నాథుల‌కు.. ఆ ఆనందం లేకుండా చేశారు కేసీఆర్. తాను జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న వైనాన్ని ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్పేశారు. దేశ రాజ‌కీయాల్లో మార్పు రావాల‌ని.. ఎంత‌సేప‌టికి కాంగ్రెస్‌.. బీజేపీలు చేసే రొడ్డు కొట్టుడు రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న విష‌యాన్ని కుండ‌బద్ధ‌లు కొట్టేశారు.

దేశంలో ఒక మూల‌న ఉండే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ మాట‌ల‌కు అంత విలువ ఇవ్వాల‌న్న సందేహం వ‌స్తేనే.. త‌ప్పులో కాలేసిన‌ట్లు లెక్క‌. ఎందుకంటే.. అంద‌రిలాంటోడు కాదు కేసీఆర్. క‌ల‌లో సైతం సాధ్యం కాద‌ని తేల్చిన తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన తెలివి కేసీఆర్ సొంతం. అలాంటి నేత నోటి వెంట జాతీయ రాజ‌కీయాల్లోకి తాను రానున్న విష‌యాన్నిచెప్ప‌ట‌మే కాదు.. అంద‌రిని ట‌చ్ చేసిన‌ట్లుగా కొంద‌రిని ట‌చ్ చేయ‌కూడ‌ద‌ని.. ఒక‌వేళ అలా చేయాల‌ని భావిస్తే.. భ‌స్మ‌మైపోవ‌టం ఖాయ‌మ‌న్న కేసీఆర్ మాట చూస్తే.. ఆయ‌న ఎలాంటి వాడో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. మోడీకి ఎదురు నిలిచే ఆలోచ‌న చేసేందుకు దేశంలోని ప‌లువురు అధినేత‌లు జంకుతున్న‌వేళ‌.. అందుకు భిన్నంగా నేనున్నానంటూ ముందుకురావ‌ట‌మే కాదు.. అంద‌రిని జ‌త‌క‌డ‌తా.. బీజేపీ.. కాంగ్రెస్ లెక్క తేలుస్తానంటూ బ‌హిరంగంగా మాట్లాడ‌టం అంటే మాట‌లు కాదు. ఆ తెగువే క‌మ‌ల‌నాథులకు ఇప్పుడు ఇబ్బందిగా మార‌ట‌మే కాదు.. ఈశాన్యన క‌మ‌ల‌వికాస‌పు ఆనందాన్ని ఎంజాయ్ చేయ‌కుండా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News