ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టిన కేసీఆర్

Update: 2018-08-26 04:17 GMT
సీఎం కేసీఆర్ ఎన్నో గొప్ప పథకాలు ప్రవేశపెట్టారు. రైతుబంధు - బీమాతో రైతుల అభిమానాన్ని చూరగొన్నారు. బీసీలకు రుణాలు - చేప విత్తనాలు - గేదెలు - గొర్రెలు పంచిపెట్టి వారిని అక్కున చేర్చుకున్నాడు. ఎందరికో ఎన్నో చేశాడు. కానీ ఒక్క నిరుద్యోగులను మాత్రం నిరుత్సాహ పరిస్తూనే ఉన్నాడు. వేసిన ఉద్యోగాలు కోర్టు కేసులతో ఆగిపోవడం.. జోనల్ వ్యవస్థతో ఆటంకాలు.. ఉద్యోగాల కల్పనలో లీకేజీలు - జాప్యం తదితర కారణాలతో కేసీఆర్ అంటే నిరుద్యోగ లోకంలో ఒకటే అసంతృప్తి.. ఏ వాట్సాప్ - ఫేస్ బుక్ ఓపెన్ చేసిన తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులకు కేసీఆర్ ఏం చేశాడనే ప్రశ్న అందరినుంచి వినిపించేది. అందరికీ వినిపించింది కేసీఆర్ కు వినిపించకుండా ఉంటుందా.. ఆయన చెవిన పడింది. అందుకే ఇప్పుడు నిరుద్యోగులను గురిచూసి కొట్టారు. ఏనుగు కుంభస్థలాన్నే కొట్టి పడగొట్టాడు. అదే కేసీఆర్ నయా ప్లాన్..

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి డిసైడ్ అయ్యి ప్రధానమంత్రిని కలవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు - ఉద్యోగాల సమస్యే అనడంలో ఎలాంటి సందేహం లేదు.  అన్ని వర్గాలను సంతృప్తి పరిచిన కేసీఆర్.. ఒక్క నిరుద్యోగులను మాత్రం నిరాశపరిచాడు. తెలంగాణ ఉద్యోగాల కల్పన సరిగ్గా జరగకపోవడంతో విద్యార్థి లోకం ఆగ్రహంగా ఉంది. ఇప్పుడా బాధను తీర్చడానికి ఏకంగా ప్రధానిని ఒప్పించి జోనల్ వ్యవస్థను తీసుకొచ్చాడు కేసీఆర్. భవిష్యత్తు మద్దతు అవసరాల కోసం మోడీ కూడా కేసీఆర్ మాటను గౌరవించాడు. జోన్లకు రాష్ట్రపతి ఆమోదం పొందాక దాదాపు 25వేల నోటిఫికేషన్లు వేసి ప్రక్రియను ప్రారంభించి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నాడు. ఇందులో 95శాతం స్థానిక జిల్లాల వారికే ఉద్యోగాలు అని ప్రకటించడంతో నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు. ఇది తెలంగాణ నిరుద్యోగులకు గొప్ప శుభవార్త అనడంలో ఎలాంటి సందేహం లేదు.

జోన్లకు రాష్ట్రపతి ఆమోదం పడగానే సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ఉద్యోగాల ప్రకటన ఇచ్చేందుకు రెడీ అయ్యారు. దాదాపు 10వేల పంచాయతీ కార్యదర్శి పోస్టులు.. వివిధ శాఖల్లోని ఖాళీలన్నింటిని భర్తీ చేసేందుకు ప్లాన్ చేశారు. దీంతో తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలు కానుంది. దీనివల్ల రగిలిపోయిన  నిరుద్యోగ లోకమంతా కేసీఆర్ ను సపోర్టు చేసే అవకాశాలున్నాయి.

కేసీఆర్ ఉద్యోగాలు కల్పించడం లేదన్న ఒకే ఒక బలమైన కారణంతో మొదట ప్రొపెసర్ కోదండరాం నినదించాడు. అనంతరం చాలా విషయాల్లో కేసీఆర్ నచ్చక పార్టీ పెట్టి పోరాడుతున్నాడు. ఇప్పుడు కోదండకు బలమైన సపోర్టుగా ఉన్న నిరుద్యోగ - ఉపాధ్యాయ వర్గాలనే కేసీఆర్ టార్గెట్ చేశాడు. ఈ సార్ కు నిరుద్యోగులను దూరం చేసేలా జోన్లను ఆమోదం తెచ్చుకొని ఉద్యోగ ప్రకటనలకు రెడీ అయిపోతున్నాడు. దీంతో తెలంగాణ నిరుద్యోగులు సైతం ఉద్యోగాలు దక్కాలంటే కేసీఆర్ కు ఓటు వేయాల్సిన పరిస్థితిని గులాబీ నేత కల్పిస్తున్నాడు. ఇలా అన్ని వర్గాలను సంతృప్తి పరిచి చివరకు నిరుద్యోగులను కూడా తనవంతు తిప్పుకొని ముందస్తుకు పెద్ద ప్లాన్ గీశారు కేసీఆర్. మరి ఈ ప్లాను వర్కవుట్ అవుతుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే..
Tags:    

Similar News