వీఆర్ఏలకు కేసీఆర్ రెండు తీపికబుర్లు... ఏంటేంటంటే?

Update: 2020-09-11 17:30 GMT
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టానికి శాసనసభ ఆమోదం తెలిపిన సందర్భంగా సీఎం కేసీఆర్... గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్ఏ)లకు ఒకేసారి రెండు తీపి కబుర్లు వినిపించారు. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం వీఆర్ఏల వ్యవస్థనే రద్దు చేస్తున్నట్లుగా కేసీఆర్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని ఇంటికి పంపడానికి బదులుగా... వారి సేవలను వినియోగించుకుంటామని, ప్రభుత్వ శాఖల్లో వారిని చోటు కల్పిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా వీఆర్ఏలకు టైం స్కేల్ ప్రకటించడంతో పాటుగా పదవీ విరమణ కోరే వీఆర్ఏల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

ఈ మేరకు శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేసీఆర్ ఈ కీలక ప్రకటన చేశారు. వీఆర్ఏల వ్యవస్థ రద్దు అవుతున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తారన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేసీఆర్.. వీఆర్ఏలకు డబుల్ బొనాంజా ప్రకటించారు. ఏళ్లుగా గ్రామాల్లో కీలక సేవలు అందిస్తున్న వీఆర్ఏల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి టైం స్కేల్ తో పాటు పదవీ విరమణ కోరే ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. గ్రామాల్లో వీఆర్ఏల సేవలను విస్మరించలేమని వ్యాఖ్యానించిన కేసీఆర్... వీఆర్ఏలలో అధిక శాతం మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు.

కేసీఆర్ నుంచి ఈ ప్రకటన రాగానే... తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం ప్రకటించింది. వీఆర్ఏలకు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ భద్రత మరిచిపోలేనిదని అసోసియేషన్ కీర్తించింది. సీఎం నుంచి ఇలాంటి కీలక ప్రకటన వచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని కూడా అసోసియేషన్ ప్రకటించింది. మొత్తంగా వీఆర్ఏలకు ఒకే సారి రెండు శుభవార్తలు చెప్పి... మొత్తంగా రెవెన్యూ శాఖ నుంచే ప్రశంసలు అందుకున్నారు. పాత రెవెన్యూ చట్టం స్థానంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్న తరుణంలో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భావన నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉద్యోగుల నుంచి ప్రశంసలు అందుకోవడం గమనార్హం.

Tags:    

Similar News