ఈ రేంజి వీడ్కోలు..నరసింహన్ కు మాత్రమే!

Update: 2019-09-07 15:20 GMT
తెలంగాణ గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ కు సీఎం కేసీఆర్ పలికిన వీడ్కోలు నిజంగానే... గవర్నర్ల చరిత్రలో ఏ ఒక్క గవర్నర్ కు కూడా దక్కి ఉండవనే చెప్పాలి. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో - తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటవుతున్న కీలక తరుణంలో గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన నరసింహన్... గవర్నర్ల చరిత్రలోనే అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. తాజాగా ఆ పదవి నుంచి దాదాపుగా విరమణ పొందిన నరసింహన్ కు... తెలంగాణ ప్రభుత్వం పలికిన వీడ్కోలు గవర్నర్ల చరిత్రలో ఓ రికార్డేనని చెప్పక తప్పదు. నరసింహన్ కు కేసీఆర్ సర్కారు పలికిన వీడ్కోలు అట్టహాసం చూస్తే ఈ మాట నిజమేనని చెప్పక తప్పదు.

తెలంగాణ సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో నరసింహన్ కు వీడ్కోలు పలికిన కేసీఆర్... ఆ తర్వాత బేగంపేట ఎయిర్ పోర్టు దాకా నరసింహన్ ను తనదైన శైలి రాచ మర్యాదలతో తీసుకుని పోయారు. రాష్ట్రపతి ప్రయాణించే తరహా వాహనానం మాదిరిగా ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్...అందులో నరసింహన్ దంపతులను కూర్చోబెట్టుకుని మేళతాళాలతో ఎయిర్ పోర్టు దాకా తీసుకుని వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలోకి నరసింహన్ దంపతులను ఎక్కించిన వైనం చూస్తే... నిజంగానే ఈ తరహా వీడ్కోలు ఏ ఒక్క గవర్నర్ కే కాదు, చివరకు మన రాష్ట్రపతులుగా పనిచేసిన నేతలకూ దక్కి ఉండదన్న వాదన వినిపిస్తోంది.

ప్రగతి భవన్ నుంచి ప్రత్యేక వాహనంలో నరసింహన్ దంపతులను ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చిన కేసీఆర్... అక్కడ ఆ దంపతులకు వీడ్కోలు పలికేందుకు తన పార్టీ నేతలతో పాటు కేబినెట్ లోని మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అదికారులను వరుసగా నిలబెట్టి వీడ్కోలు పలికించారు. చివరగా స్పెషల్ ఫ్లైట్ వద్ద తాను నిలుచుండి నరసింహన్ దంపతులకు కేసీఆర్ వీడ్కోలు పలికారు. ఈ దృశ్యాలను చూసిన వారంతా నరసింహన్ వీడ్కోలు పుణ్యమా అని బేగంపేట ఎయిర్ పోర్టు పరేడ్ గ్రౌండ్ గా మారిపోయిందా? అన్న అనుమానాలు కూడా కలిగాయి. ఫ్లైట్ ఎక్కే ముందు నరసింహన్ కు పోలీసు దళాలతో ప్రత్యేకంగా గౌవర వందనం చేయించిన కేసీఆర్... నరసింహన్ కు ఘనంగా వీడ్కోలు పలికారు.

Tags:    

Similar News