కేసీఆర్ ఈ కుక్క‌లు...తోక‌ల భాషేందో...

Update: 2019-09-24 11:11 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు - ఉద్యోగుల‌కు రోజు రోజుకు గ్యాప్ పెరుగుతూ వ‌స్తోంది. తెలంగాణలో రెవెన్యూ శాఖ లేదా వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేస్తే సమ్మెకు దిగుతామ‌ని ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీ చేస్తోన్న ప్ర‌భుత్వ ఉద్యోగులపై రెవెన్యూ సిబ్బందిపై కేసీఆర్ కోపంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వాడుతోన్న భాష‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.  కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో కుక్క తోకను ఊపాలి గాని తోక కుక్కను ఊపకూడదు అంటూ వ్యాఖ్యానించారు. ఇది సరిగా పనిచేయని ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆయన చేసిన వ్యాఖ్య.

ఉద్యోగులకు య‌జ‌మాని అయిన ప్ర‌భుత్వం ఆదేశాలు పాటించాల‌ని... అది వారి విధి అంటోన్న ఆయ‌న ప్ర‌భుత్వాన్ని వారు ఆదేశించ‌లేర‌ని ఫైర్ అవుతున్నారు. ప్ర‌భుత్వ ఆదేశాలు ఎలా ?  ఉన్నా వాటిని ఉద్యోగులు పాటించాల్సిందే అని... వేరే ఆప్ష‌న్ లేద‌ని కూడా ఖ‌రాఖండీగా చెప్పేస్తున్నారు. ఉద్యోగుల వెర్ష‌న్ మాత్రం వేరేలా ఉంది. స‌మైక్య రాష్ట్రంలో ప్ర‌త్యేక తెలంగాణ కోసం తాము ఎన్నో పోరాటాలు చేశామ‌ని... ఎన్నోసార్లు స‌మ్మెల‌కు దిగ‌డంతో పాటు నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొని కేసులు కూడా ఎదుర్కొన్నామ‌న్న విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఏకంగా 40 రోజుల పాటు స‌మ్మెలో పాల్గొని ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన విష‌యం కేసీఆర్ మ‌ర్చిపోయారా ? అని గుర్తు చేస్తున్నారు.

ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోగులు చేసిన పోరాటాన్ని ప్ర‌శంసించిన కేసీఆర్ వాళ్ల‌కు ప్ర‌త్యేక ఇంక్రిమెంట్లు కూడా ఇచ్చారు. అదే క్ర‌మంలో ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు సైతం కేసీఆర్ ఉద్యోగులు త‌మ హ‌క్కుల కోసం పోరాటం చేయ‌డంలో త‌ప్పులేద‌ని అనేవారు. అయితే ఇప్పుడు అదే కేసీఆర్ ఉద్యోగులు ప్ర‌భుత్వంపై పోరాటం చేసేందుకు కాదు క‌దా... క‌నీసం నిర‌స‌న తెలిపేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని వారు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఏదేమైనా తెలంగాణలో కేసీఆర్ వ‌ర్సెస్ ఉద్యోగుల వార్ రోజు రోజుకు తీవ్ర‌మ‌వుతోంది. ఇది ఏ దిశ‌గా వెళుతుందో ?  చూడాలి.


Tags:    

Similar News