‘కారు’ ఎక్కేందుకు గుత్తాకు క్లియరెన్స్ వచ్చేసింది

Update: 2016-06-08 04:57 GMT
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత.. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గులాబీ కారు ఎక్కనున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కారు ఎక్కేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అధికారపక్షంలోకి గుత్తా చేరాలన్న అంశంపై కొద్దిరోజులుగా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఫైనల్ కాలేదు. టీఆర్ఎస్ లోకి గుత్తా ఎంట్రీకి సంబంధించిన మొత్తం వ్యవహారాలు బయటకు రాక ముందే ఆయన చేరిక వ్యవహారం మీడియాలో వచ్చేసింది.

తాజాగా నల్గొండ జిల్లా నేతలతో భేటీ అయిన కేసీఆర్.. గుత్తాకు క్లియరెన్స్ ఇచ్చేసినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరే పక్షంలో తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలన్న పట్టుదలతో గుత్తా ఉండటం.. అలాంటిదేమీ అక్కర్లేదంటూ కేసీఆర్ చెప్పినప్పటికీ.. రాజీనామా మీద గుత్తా వెనక్కి తగ్గలేదని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో ఎంపీ పదవికి రాజీనామా అంశం గుత్తాకే కేసీఆర్ వదిలేసినట్లుగా తెలుస్తోంది. టీఆర్ ఎస్ లోకి ఎప్పుడు రావాలన్నది గుత్తాకే వదిలేసినట్లుగా తెలంగాణ అధికారపక్ష నేతలు చెబుతున్నారు. ఒకవేళ.. ముందు నుంచి చెబుతున్నట్లుగా గుత్తా కానీ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తే.. తదనంతరం ఏం చేయాలన్న అంశంపై కేసీఆర్ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. కారు ఎక్కే ముహుర్తం గుత్తా నోటి నుంచి రావటమే మిగిలి ఉందన్నమాట.
Tags:    

Similar News