రేవంత్ జంపింగ్‌..కేసీఆర్ కౌంట‌ర్ ఆప‌రేష‌న్ రెడీ

Update: 2017-10-21 09:54 GMT
తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామంగా మారిన సంగ‌తి తెలిసిందే. టీడీపీకి అయితే ఈ ఎపిసోడ్ శ‌రాఘాతంగా మారింది. ఇప్పుడిప్పుడే తాము గాడిలో ప‌డుతున్నామ‌ని భావిస్తుంటే....పార్టీ మారేందుకు రేవంత్ సిద్ధ‌మ‌వ‌డంపై ఈ ఆశ‌ల‌పై నీళ్లు కుమ్మ‌రించిన‌ట్ల‌యింద‌ని చెప్తున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం మొద‌లైంది. ఇటీవ‌లి కాలంలో త‌మ పార్టీ నుంచి జంప్ చేసే నాయ‌కులే త‌ప్ప ... పార్టీలోకి వ‌చ్చేవారు లేని త‌రుణంలో రేవంత్ వంటి బ‌ల‌మైన నేత పార్టీలోకి వ‌చ్చేందుకు ఓకే చెప్ప‌డాన్ని ఆ పార్టీ పూర్తిగా స్వాగ‌తిస్తోంది. అయితే...ఈ మొత్తం ఎపిసోడ్‌ లో టీఆర్ ఎస్ అధినేత‌ - ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏం చేస్తున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

న‌వంబ‌ర్ 9 త‌ల‌పెట్టిన‌ రాహుల్‌ గాంధీ రాష్ట్ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా లేదా సోనియాగాంధీ జ‌న్మదినం సంద‌ర్భంగా కాంగ్రెస్ గూటికి చేరేందుకు రేవంత్ రెడ్డి డిసైడ‌యిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి త‌గ్గ‌ట్లుగా త‌న‌వాళ్ల‌తో రేవంత్ చ‌ర్చిస్తున్న‌ట్లు చెప్తున్నారు. ఈ చేరిక అనంత‌రం స‌హ‌జంగానే రేవంత్‌....త‌న పూర్వ‌పు వ్య‌వ‌హ‌ర‌శైలి అయిన `అటాక్ కేసీఆర్` అజెండాతో ముందుకు సాగుతారు. ఒక‌వేళ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ లేదా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ వంటి ప‌ద‌వి క‌ట్ట‌బెడితే....ఇక రేవంత్ దూకుడు ఆప‌డం క‌ష్ట‌మ‌ని టీఆర్ ఎస్ పార్టీ అంచ‌నా వేస్తోంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్ అధిష్టానం కౌంట‌ర్ ఆప‌రేష‌న్ రెడీ చేసిన‌ట్లు స‌మాచారం.

తెలంగాణ‌లో టీడీపీ - బీజేపీ స‌హా ఇత‌ర పార్టీల్లో కొన‌సాగుతూ టీఆర్ ఎస్‌ లో చేరాల‌ని భావిస్తున్న నేత‌ల‌కు గులాబీ పార్టీ డెడ్‌ లైన్ విధించిన‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ పార్టీలో చేరాల‌నుకుంటే...ఈ నెలాఖ‌రులోగా త‌మ నిర్ణ‌యం చెప్పాల‌ని, పార్టీ కండువా క‌ప్పుకోవాల‌ని...లేదంటే మరెప్పుడూ చేరిక గురించి ప్ర‌స్తావన తేవ‌ద్ద‌ని తేల్చిచెప్పిన‌ట్లు టీఆర్ ఎస్‌ లోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌ క‌ఠినంగా టీఆర్ ఎస్ పెద్ద‌లు ఆర్డ‌ర్ వేయ‌డం వెనుక మ‌ర్మం రేవంత్ చేరిక కార‌ణంగా కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తే...దానికి ఆదిలోనే బ్రేకులు వేయ‌డ‌మ‌ని అంటున్నారు. రేవంత్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్ నుంచి చేరిక‌లు ఇందులో మొద‌టి భాగ‌మ‌ని అంటున్నారు.
Tags:    

Similar News