అల్లానే తెలంగాణ ఇచ్చారని ప్రజలు భావిస్తున్నారట

Update: 2015-07-12 23:01 GMT
ఎక్కడ తాళం అక్కడ వేయాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆకట్టుకునేలా మాట్లాడటం.. భావోద్వేగాల్ని స్పృశించేలా మాట్లాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి కేసీఆర్ కు వేలాదిమంది మైనార్టీల్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం వస్తే ఆయన ఎలా మాట్లాడతారు? ఏం విషయాలు చెబుతారన్నది చూడాలంటే.. ఆదివారం ముగిసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

తెలంగాణ రావటానికి కారణం అంటూ చాలామంది దేవుళ్ల అకౌంట్లో క్రెడిట్ వేసేసిన కేసీఆర్.. తాజాగా అల్లాకు తెలంగాణ క్రెడిట్ ఇచ్చేశారు. ‘‘అల్లానే తెలంగాణ ఇచ్చారని ప్రజలు భావిస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యానించి.. మైనార్టీల మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశారు. ప్రజలు అనుకుంటున్నారే కానీ.. తాను అనుకుంటున్నానా? లేదా? అన్న విషయంలో మాత్రం కేసీఆర్ తన మాటల చాతుర్యాన్ని ప్రదర్శించారని చెప్పక తప్పదు.

తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న కేసీఆర్.. ఆ మాటలో మరికాస్త ముందుకెళ్లి ‘‘నేను మీ వాడినే’’ అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గంగా.. జమున.. తెహజీబ్ తో తెలంగాణ వర్ధిల్లిందంటూ అభివర్ణించిన కేసీఆర్.. మహాత్మ గాంధీ సైతం హైదరాబాద్ లోని మతసామరస్యంపై సంతోషం వ్యక్తం చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. 1923లో హైదరాబాద్ వచ్చిన ఆయన.. హైదరాబాద్ లోని మతసామర్యం చూసి మురిసిపోయారని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News