మెడలు వంచి.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ సైతం క్రాక్ చేయలేకపోతున్నారా?

Update: 2023-03-16 21:00 GMT
ఎంత మేధావికి అయినా.. ఎంత తోపు.. తరుంఖాన్ కు కాలం తెచ్చే పరిమితులు ఉంటాయన్నది తెలిసిందే. అందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మినహాయింపు కాదా? అన్నది ప్రశ్నగా మారిందిప్పుడు. ఎప్పుడూ తాను విసిరిన వలలో ప్రత్యర్థులు పడాలని తపించే గులాబీ బాస్ కు తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు. తన గారాల పట్టి కమ్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో పాత్రను చేయటంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేసీఆర్ బోలెడన్ని ఎదురుదెబ్బలు తిన్నారు.

అయినప్పటికీ.. ఇప్పుడున్న విచిత్రమైన పరిస్థితుల్లో మాత్రం ఆయన లేరంటున్నారు. తన మీద ఆరోపణలు వచ్చినా ఫర్లేదు కానీ.. తన కుటుంబ సభ్యుల మీద రావటం.. తాను ముఖ్యమంత్రిగా తిరుగులేని స్థానంలో ఉన్న వేళ.. పడిన మరక ఆయన్ను ఇబ్బంది పెడుతుందని చెబుతున్నారు. కేసీఆర్ రాజకీయ జీవితాన్ని చూస్తే.. దివంగత మహానేత వైఎస్ మరణానికి ముందు వరకు కేసీఆర్ కు ఎదురైన ఎదురుదెబ్బలు అన్ని ఇన్ని కావు. వైఎస్ మరణం తర్వాత ఆయన మాటలకు.. చేతలకు తిరుగులేదన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి.

ఆయనేం అనుకుంటే అది.. ఎవరిని టార్గెట్ చేయాలనుకున్న ఇట్టే చేసేయటం.. కొండ మీద కోతిని సైతం తన కనుసైగతో తెప్పించుకునే సత్తాను సొంతం చేసుకున్నారు. అలాంటి ఆయనకు అనూహ్యంగా ఎదురైన తాజా పరిణామాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన కుమార్తె పాత్రపైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు కనీసం నోరు విప్పింది లేదు.  చేయాల్సిన పనుల్ని తెర వెనుక చేస్తున్న ఆయన.. ఢిల్లీలో జరిగే పరిణామాల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది.

తాను సీన్లోకి రాకుండా చేయాల్సిన పనుల్ని తన అనుచర వర్గంతో చేయించే టాలెంట్ ఉన్న కేసీఆర్.. క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వేళలో మాత్రం ఆయన తీరు కాస్తంత భిన్నంగా ఉంటుంది. సాధారణంగాతన మేనల్లుడు హరీశ్ ను రంగంలోకి దింపటం ద్వారా.. పరిస్థితి తీవ్రత ఇట్టే అర్థమయ్యేలా చేస్తారు. ఇక.. హరీశ్ కు తోడుగా మంత్రి కేటీఆర్ ను రంగంలోకి దించారంటే.. పరిస్థితి ఇబ్బందికరంగా ఉందన్న విషయాన్ని తన చర్యతో చెప్పేయటంతో పాటు..తనకున్న సర్వ శక్తుల్ని ఒడ్డే ప్రయత్నం చేస్తారని చెబుతారు.

ఢిల్లీలో జరిగే ఈడీ విచారణ కోసం కవిత వెళ్లటం ఒక ఎత్తు అయితే.. ఆమెకు తోడుగా ఉండేందుకు హరీశ్, కేటీఆర్ లను దించటం ద్వారా.. ఈ ఇష్యూకు తానెంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు కేసీఆర్. తెలంగాణ లాంటి కష్టసాధ్యమైన టాస్కునే కేంద్రం మొడలు వంచి తెచ్చిన తన లాంటి అధినేతకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావటాన్ని జీర్ణించు కోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.

తాజా పరిణామాల్ని చూస్తున్న ప్రగతి భవన్.. ఫాంహౌస్ లోని వర్గాల మధ్య జరుగుతున్నసంభాషణ ఆసక్తికరంగా మారింది. తమలో తాము ఎందుకిలాంటి దెబ్బలు తగులుతున్నాయి? ఎంత మోడీకి కోపం వస్తే సైతం.. తమను ఇంత తేలిగ్గా క్రాక్ చేయటం ఏమిటి? తమ శక్తియుక్తులు ఏమయ్యాయి? తమను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇబ్బంది ఎలా పెట్టగలుగుతారు? లాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా పరిస్థితుల నేపథ్యంలో కొందరు మరోలా మాట్లాడటం గమనార్హం. ఈ మధ్య వరకు తమకు తిరుగులేనట్లుగా ఉండే కాలం ఈ మధ్యన అందుకు భిన్నంగా ఉందన్న మాట గులాబీ పార్టీలో వినిపిస్తుండటం గమనార్హం. కాలం కలిసి రావటం లేదా? ఎమిటీ ఎదురు దెబ్బలు? లాంటి మాటలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఈ వాదనలో నిజం ఎంతన్నది తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News