ఉప రాష్ట్రప‌తి కేసీఆర్‌.. సీఎం కేటీఆర్

Update: 2021-10-07 08:30 GMT
జాతీయ రాజ‌కీయాల‌పై కేసీఆర్‌కు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తి ఉంది. జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. అందుకే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు
దేశంలోని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మినహా మిగ‌తా ప్ర‌ధాన పార్టీల‌ను క‌లిపి ఓ ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌ని తెగ ప్ర‌య‌త్నించారు. అప్ప‌ట్లో నానా హంగామా చేశారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో ఎన్డీయేకు మ‌ళ్లీ పూర్తి మెజార్టీ వ‌చ్చి మోడీ రెండో సారి ప్ర‌ధాని కావ‌డంతో ఆ త‌ర్వాత కొంత కాలం సైలెంట్ అయిపోయారు. కానీ తాజాగా ఒకే నెల‌లో రెండు సార్లు కేసీఆర్ ఢిల్లీ వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల వెన‌క ర‌హ‌స్యం ఏమై ఉంటుందా? అనే ప్ర‌శ్న‌లు రేకెత్తాయి. అయితే అందుకు స‌మాధానంగా ఓ ప‌త్రిక ప్ర‌చురించిన క‌థ‌నం సంచ‌ల‌నంగా మారింది.

కేసీఆర్ ఉప  రాష్ట్రప‌తి కావాల‌ని కోరుకుంటున్నార‌ని త‌న త‌న‌యుడు కేటీఆర్‌ను ఇక్క‌డ తెలంగాణ‌లో సీఎం చేసి ఆయ‌న ఢిల్లీ వెళ్లిపోవాల‌ని అనుకుంటున్నార‌నేది ఆ క‌థ‌నం సారాంశం. అందుకే బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో మంత‌నాలు చేస్తున్నార‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. ఢిల్లీ రాజ‌కీయాల‌పై క‌న్నేసిన కేసీఆర్‌.. తెలంగాణ‌లో ప‌వ‌ర్‌ను కేటీఆర్‌కు అప్ప‌గించాల‌నే ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నార‌నే వార్త‌లు ఎప్ప‌టి నుంచో వ‌స్తున్నాయి. అందుకే హ‌రీశ్‌ను కాద‌ని కేటీఆర్‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చేశార‌నే ప్ర‌చారం సాగింది. ముఖ్య‌మంత్రి అయే క్ర‌మంలో అయిన త‌ర్వాత కూడా కేటీఆర్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌కూడ‌ద‌ని కేసీఆర్ లైన్ క్లియ‌ర్ చేస్తున్నార‌నే అభిప్రాయాలున్నాయి. జాతీయ రాజ‌కీయ‌ల్లో కీల‌కంగా మారాల‌ని అనుకుంటున్న కేసీఆర్ ఇటీవ‌ల చేసిన ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

మొద‌టి సారి తెలంగాణ భ‌వ‌న్ భూమి పూజ కోసం వెళ్లిన కేసీఆర్‌.. దాదాపు వారం రోజుల పాటు అక్క‌డే మ‌కాం వేసి మోడీషాల‌తో పాటు కేంద్ర మంత్రుల‌నూ క‌లిశారు. ఇటీవ‌ల రెండో సారి మ‌ళ్లీ వెళ్లిన ఆయ‌న కేంద్ర హోం శాఖ స‌మావేశంలో పాల్గొన‌డంతో పాటు కొంత‌మంది కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు. దీంతో ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నార‌నే ప్ర‌చారం మొద‌లైంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా కేసీఆర్ ఉప రాష్ట్రప‌తి కావాల‌నుకుంటున్నార‌నే అంశం తెర‌పైకి వ‌చ్చింది. గ‌తంలోనూ ఒక‌సారి ఈ ప్ర‌చారం సాగినా ఆ విష‌యం అక్క‌డ‌తోనే ఆగిపోయింది. కానీ ఈ సారి మాత్రం కేసీఆర్ ఉప రాష్ట్రప‌తి కావ‌డానికి బీజేపీ పెద్ద‌ల నుంచి సానుకూల‌త వ్య‌క్త‌మ‌వుతుంద‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌స్తుత ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడి ప‌ద‌వీ కాలం పూర్తి కాగానే ఆయ‌న స్థానంలో మ‌రో తెలుగు వ్య‌క్తి కేసీఆర్‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని తాజా క‌థ‌నం తెలిపింది.

త‌న‌కు ఉప రాష్ట్రప‌తిగా అవ‌కాశం ఇస్తే బీజేపీతో క‌లిసేందుకు కేసీఆర్‌కు ఎలాంటి అభ్యంత‌రాలు ఉండ‌వ‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు కేటీఆర్‌కు అడ్డుగా మార‌తాడ‌ని భావిస్తున్న హ‌రీశ్‌ను త‌న వెంట ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర మంత్రిని చేయ‌డం వ‌ల్ల త‌న కొడుక్కి లైన్ క్లియ‌ర్‌గా ఉంటుంద‌ని కేసీఆర్ అనుకుంటున్న‌ట్లు ఆ క‌థ‌నం తెలిపింది. అయితే దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న కేసీఆర్‌.. యాక్టివ్ రాజ‌కీయాల ప‌రంగా చూసుకుంటే పెద్ద‌గా ప్రాధాన్యం లేని ఉప రాష్ట్రప‌తి అవ్వాల‌ని ఎందుకు కోరుకుంటారు? అందులో నిజం లేద‌ని ఈ వార్త‌ను కొట్టిపారేసే వాళ్లూ ఉన్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీకి మెజారిటీ త‌గ్గితే ఏపీ తెలంగాణ ఎంపీలు మ‌ద్ద‌తు అవ‌స‌రం ప‌డే అవ‌కాశం ఉంది. కానీ ఈ మ‌ద్ద‌తు కోసం కేసీఆర్‌ను ఉప రాష్ట్రప‌తిని చేస్తారా? అన్న‌ది సందేహ‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.
Tags:    

Similar News