కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లో 'తెలంగాణ‌'

Update: 2018-02-14 05:24 GMT
ఆశ్చ‌ర్య‌పోయే నిజం. టెక్నాల‌జీని ఎంత‌లా వాడుకోవ‌చ్చో ఉద్య‌మ‌నేత నుంచి ముఖ్య‌మంత్రిగా మారిన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సిద్ధం చేయిస్తున్న హైటెక్ ఎత్తుగ‌డ‌గా చెప్పాలి. త‌న ట‌చ్ కు దూరంలో యావ‌త్ తెలంగాణ‌ను సిద్ధం చేయ‌ట‌మే కాదు. ఎక్క‌డేం జ‌రుగుతుందో.. లైవ్ లో చూసే భారీ ఏర్పాట్లు పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయి. దీంతో.. కేసీఆర్ చేయాల‌నుకుంటున్నారు? ఏం సాధించాల‌నుకుంటున్నారు? అన్న‌ది చూస్తే.. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశాలు వెలుగులోకి వ‌స్తాయి. అవేంటో తెలుసుకుందామా? .  

నిజామాబాద్ జిల్లా ప‌రిష‌త్ స‌మావేశం జ‌రుగుతోంది. అయితే అక్క‌డేం జ‌రుగుతుందో కేసీఆర్ చూసేయ‌గ‌ల‌రు. అదే స‌మ‌యంలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్  జిల్లా క‌లెక్ట‌ర్ నేతృత్వంలో అత్యున్న‌త స్థాయి స‌మావేశం జ‌రుగుతుంది. జిల్లా క‌లెక్ట‌ర్ ఏం మాట్లాడుతున్నారో ముఖ్య‌మంత్రి వీక్షించ‌గ‌ల‌రు. అంతేనా.. ఖ‌మ్మంలో జిల్లా వ్య‌వ‌సాయ అధికారులు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. వారి ప‌ర్య‌ట‌న ఎలా సాగుతుందో చూసేయొచ్చు. అంతేనా.. నిజామాబాద్ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళ‌న చేస్తున్నారు. అక్క‌డేం జ‌రుగుతోంద‌న్న‌ది ముఖ్యమంత్రే స్వ‌యంగా ట్రాక్ చేసేయొచ్చు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డేం జ‌రిగినా.. ప్ర‌త్య‌క్షంగా.. లైవ్ లో చూసే అత్యాధునిక సాంకేతిక‌త‌ను ముఖ్య‌మంత్రి వాడేయ‌నున్నారు. త‌న‌కెంతో ఇష్ట‌మైన ప్ర‌గ‌తి భ‌వ‌న్ బ‌య‌ట‌కు రాకుండానే ఇవ‌న్నీ కేసీఆర్ చేసేసే వీలుంది? ఇంత‌కీ అదెలా సాధ్య‌మంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. ఈ విష‌యాన్ని చెప్పే ముందు మీకో ఉదాహ‌ర‌ణ చెబితే.. కేసీఆర్ ఫ్యూచ‌ర్ ప్లాన్ ఇట్టే అర్థ‌మైపోతుంది.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో పోలీసులు అత్యాధునిక సాంకేతిక‌తో క‌మాండ్ కంట్రోల్ స్టేష‌న్ ను ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంచుమించు ఇదే త‌ర‌హాలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ముఖ్య అధికారులు ఎప్పుడేం చేస్తున్నారో తెలుసుకునేలా స‌రికొత్త సాంకేతిక‌త‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ వ్య‌వ‌స్థ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికార నివాసంలోనూ.. తెలంగాణ స‌చివాల‌యంలోనూ అందుబాటులోకి తేనున్నారు.

ఈ అత్యాధునిక సాంకేతిక‌తో తెలంగాణ వ్యాప్తంగా ఎక్క‌డేం జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని టీవీల్లో చూడాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డేం జ‌రుగుతుంద‌న్న విష‌యం టీవీల ద్వారా కానీ.. నిఘా వ‌ర్గాల ద్వారా కానీ తెలుసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా.. ప‌రిమిత‌మైన సిబ్బందితో తెలంగాణ వ్యాప్తంగా ఎక్క‌డేం జ‌రుగుతోంది? ఏ అధికారి ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? ఆయా జిల్లాల్లో అమ‌ల‌వుతున్న ప్రాజెక్టుల్లో ప‌నులు ఎలా జ‌రుగుతున్నాయ‌న్న విష‌యాన్ని లైవ్ లో చూసే ఏర్పాట్లు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రుగుతున్నాయి.

భారీ డిజిట‌ల్ స్క్రీన్ల‌ను ఏర్పాటు చేయ‌టంతో పాటు.. ఇందుకు అవ‌స‌ర‌మైన నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేస్తున్నారు. అంటే.. ట‌చ్ దూరంలో తెలంగాణ మొత్తం త‌న క‌నుస‌న్న‌ల్లో ఉండేలా చేస్తున్నారు కేసీఆర్‌. చీమ చిటుక్కుమ‌న్నా త‌న‌కు తెలిసేలా ముఖ్య‌మంత్రులు నిఘా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకోవ‌టం విన్నాం. కానీ.. అందుబాటులోకి వ‌చ్చిన టెక్నాల‌జీ సాయంతో ఎక్క‌డేం జ‌రిగినా తెలుసుకునేలా ప్ర‌గ‌తిభ‌వ‌న్ ను మార్చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కానీ పూర్తి అయితే.. తెలంగాణ‌లోని ప్ర‌తి కీల‌కాంశాల గురించి కేసీఆర్‌కు ఎవ‌రూ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఆయ‌న‌కు ఆయ‌నే నేరుగా తెలుసుకునే వీలుంటుంది. మాట‌ల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసాన్ని త‌గ్గించుకోవ‌టంతో పాటు.. వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్ల‌టానికి అవ‌స‌ర‌మైన రంగాన్ని కేసీఆర్ సిద్ధం చేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News