సీన్ రివ‌ర్స్ః ప్ర‌తిపక్షాల‌కు కేసీఆర్ లేఖ‌లు!

Update: 2016-07-16 09:33 GMT
మొక్కలు నాటడమే కాక సంరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన పిలుపుతో కుగ్రామం నుండి మహానగరం దాకా కదిలించారు. ఈ క్ర‌మంలో తెలంగాణ వ్యాప్తంగా హరితోద్యమం ఉత్తేజితంగా సాగుతోంది. ఈ కార్యక్రమం తాత్కాలికం కాకూడదని శాశ్వతం కావాలని సంకల్పిస్తున్న కేసీఆర్‌ ఈ పథకం పకడ్బందీగా.. దీర్ఘకాలంగా కొనసాగేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్షాల‌ను కొత్త‌గా ఇరికించేందుకు ప్ర‌ణాళిక వేశార‌ని తెలుస్తోంది.

స్వచ్చమైన వాతావరణ కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని రాజకీయాలతో ముడిపెట్టి చూడకుండా.. సంపూర్ణంగా సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్షాలకూ లేఖ రాయాలని నిర్ణయించారు. బృహత్తర కార్యక్రమంలో పాల్గొనకుండా విపక్షాలు రోటీన్‌ విమర్శలు చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆయన.. భావితరాలకు స్వచ్చమైన వాతావరణం అందించేందుకు చేస్తున్న మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని ఈ లేఖ‌ల్లో కోరనున్నారు. త‌ద్వారా ప్ర‌తిప‌క్షాలు ఆకుప‌చ్చ తెలంగాణ సాకారం అయ్యేందుకు క‌లిసి వ‌స్తాయో రావో తేలిపోతుంద‌ని కేసీఆర్ అంచ‌నా వేస్తున్నారు. క‌లిసి వస్తే త‌న‌కు మైలేజీ, రాక‌పోతే ప్ర‌తిప‌క్షాల‌కు డ్యామేజీ అనేది కేసీఆర్ స్ట్రాట‌జీగా చెప్తున్నారు.

ఐదేళ్ళలో 230కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ  ప్రభుత్వం ఈ ఏడాది 46కోట్ల మొక్కలను నాటాలని అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. మొక్క‌లు నాటి వ‌దిలేయ‌డ‌మే కాకుండా వాటిని సంర‌క్షించేందుకు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయించారు. మొక్క‌లు ఎదిగేందుకు నీరు స‌క్ర‌మంగా అంద‌జేయాల‌ని సూచించారు. ఇందుకోసం ఫైరింజ‌న్ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అంతేకాకుండా మొక్క‌ల ఎదుగుద‌ల విష‌యంలో తాను త‌ర‌చుగా స‌మీక్షిస్తుంటాని కేసీఆర్ చెప్పారు. త్వ‌ర‌లో వీడియో కాన్ఫ‌రెన్స్‌ లు నిర్వ‌హిస్తాన‌ని కూడా కేసీఆర్ ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News