కేసీఆర్ కోరిక‌..న‌న్ను అపార్థం చేసుకోవ‌ద్దు

Update: 2018-04-29 01:30 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాబోయే ఎన్నిక‌ల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఒక‌దాని వెంట మ‌రొక‌టి అన్న‌ట్లుగా కేసీఆర్ నిర్వ‌హిస్తున్న స‌మావేశాలు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. అట్ట‌హాసంగా ప్లీన‌రీ నిర్వ‌హించిన మ‌రుస‌టి రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న టీఆర్ ఎస్ శ్రేణుల‌తో స‌మావేశం అవ‌డం, ఆ మ‌రుస‌టిరోజే జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన పార్టీగా పేరున్న డీఎంకే ర‌థ‌సార‌థుల‌తో చ‌ర్చ‌ల‌కు ప్ర‌త్యేకంగా చెన్నై వెళ్ల‌డం ఈ చ‌ర్చ‌కు బ‌లం చేకూరుస్తుంది. అయితే ఎన్నారైల‌తో భేటీ సంద‌ర్భంగా కేసీఆర్ ఇచ్చిన క్లారిటీ ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హ‌జంగా విమ‌ర్శ‌లంటే...మిగ‌తా నాయ‌కుల వ‌లే ఇబ్బంది ప‌డ‌కుండా ఆస్వాదిస్తార‌నే టాక్ ఉంది. అలాంటి కేసీఆర్ మొద‌టిసారిగా ఎన్నారైల‌కు వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న గురించి జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆయ‌న క్లారిటీ ఇస్తూ..అపార్థం చేసుకోవ‌ద్ద‌ని అభ్య‌ర్థించ‌డం గ‌మ‌నార్హం. ప్రగతి భవన్‌ లో వివిధ దేశాలకు చెందిన ఎన్ ఆర్ ఐ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... తెలంగాణ అభివృద్ధి - జాతీయ రాజకీయాలు - ఎన్ ఆర్ ఐల సంక్షేమంపై సీఎం చర్చించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నాలను తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు ప్రపంచవ్యాప్తంగా చర్చకు పెట్టాలని కేసీఆర్ కోరారు. భారతదేశ ప్రజల ఎజెండా రూపొందించడంలో తెలంగాణ నాయకత్వం చేస్తున్న కృషిని వివరించాలని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు అంటున్న‌ట్లుగా తాను పదవుల కోసమో.. లేదంటే ఇంకా దేనికోసమో జాతీయ రాజకీయాల గురించి ఆలోచించడం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ దేశ పౌరుడిగా.. దేశంలో మార్పు తేవడానికి తన వంతు ప్రయత్నంగా ఏదైనా చేయగలనా అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని, పని మొదలు పెట్టానన్నారు. `మనకెందుకులే అనుకుంటే తెలంగాణ వచ్చేదా.. మనకెందుకులే అని అందరూ అనుకుంటే దేశంలో మార్పు సాధ్యమవుతుందా.. ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి.. అది మనమే చేశాం.. మనం ప్రయత్నిస్తే తప్పక మార్పు సాధ్యమవుతుంది` అని సీఎం తెలిపారు.

దేశ ప్రజలకు కావాల్సిన ఎజెండా రూపొందిస్తున్నానని, ఈ ఎజెండాను యావత్ దేశం అంగీకరిస్తుందని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. దాని ప్రకారం వివిధ రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలు రూపొందించుకుంటే తప్పక మార్పు సాధ్యమవుతుందన్నారు. `కేంద్ర బడ్జెట్ రూ. 24.47 లక్షల కోట్లు. అందులో రూ. 8.70 లక్షల కోట్లు అప్పుల వ‌డ్డీలకు పోతుంది. రూ. 10 లక్షల కోట్ల జీతభత్యాలు - పెన్షన్ల లాంటి నిర్వహణ ఖర్చుకు పోతుంది. ఐదారు లక్షల కోట్లు కేంద్ర ప్రాయోజిత పథకాలు(సీఎస్ ఎస్)కు పోతుంది. ఇక మిగిలేది రెండు మూడు లక్షల కోట్లు మాత్రమే. కేవలం ఈ రెండు మూడు లక్షల కోట్లతో ఇంత పెద్ద జనాభా ఉన్న విశాల దేశంలో అభివృద్ధి పనులు ఎలా సాగుతాయి. ఇలా చేసుకుంటూ పోతే దేశం ఎలా బాగుపడాలి.. ఎప్పుడు బాగుపడాలి. ఏడు దశాబ్దాలు గడిచినా దేశంలో ఎక్కడ చూసినా అశాంతి, అసంతృప్తి, ఆందోళన, కులం, మతం పేరిట ఘర్షణలు. వీటికి పరిష్కారం లేదా? ఈ విషయాలను ఎన్ఆర్ఐలు ఆలోచించాలి. మన పక్కనే ఉన్న చైనా ఇప్పుడు ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా మారింది. మనమెందుకు మారడం లేదో ఆలోచించాలి. చాలా అంశాల్లో మన దేశం ఇతర దేశాలతో పోలిస్తే ఎంతో వెనకబడింది. ఈ పరిస్థితి రావడానికి ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలే కారణం. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీపై వ్యతిరేకత వస్తే.. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. అయితే ఏం లాభం? దేశానికి ఏం మేలు జరుగుతుంది..? ఏం మార్పు సాధ్యమవుతుంది...? ఒకరి మీద కోపంతో మరొకరిని గెలిపిస్తాం. ఎవరు గెలిచినా పరిస్థితిలో మార్పు మాత్రం రాదు. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. ప్రజల ఎజెండా తయారు కావాలి.. నిజంగా ఈ దేశానికి ఏం కావాలి? ఈ దేశం ఎటు పోవాలి.. అనే మార్గదర్శకం అవసరం` అంటూ త‌న ఆలోచ‌న‌ను కేసీఆర్ వివ‌రించారు.

Tags:    

Similar News