ఇది.. కేసీఆర్ లో మరో కోణం

Update: 2015-11-16 08:38 GMT
రాజకీయ ప్రత్యర్థులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ స్థాయిలో విరుచుకుపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల విషయంలో కరకు వైఖరి ప్రదర్శించే ఆయన.. చాలా సున్నిత అంశాల విషయంల్లో సత్వరమే స్పందించటమే కాదు.. వారెప్పటికీ మర్చిపోలేని అనుభూతిని మిగులుస్తారు. తన వద్దకు సాయం కోసం వచ్చే వారి విషయంలోనూ.. తనను అభిమానించే వారి విషయంలో భోళా శంకరుడిలా వ్యవహరిస్తుంటారు.

తన మంత్రి ద్వారా విన్న ఒక సమాచారంపై వెనువెంటనే స్పందించిన కేసీఆర్..ఈ అంశంపై ఆయన వ్యవహరించిన తీరుకు అందరూ ప్రశంసిస్తున్నారు. వరంగల్ జిల్లా తొర్రూరుకు చెందిన రాకేశ్ అనే చిన్న కుర్రాడికి చూపు సరిగా కనిపించదు. మాట రాదు. కానీ.. అతనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే చాలా చాలా ఇష్టం.

ఈ ఇష్టంతో కేసీఆర్ కు సంబంధించిన పేపర్ కటింగ్ లను తన వద్ద దాచుకోవటమే కాదు.. చిత్రాలు వేస్తుంటాడు. ఈ మధ్యనే మంత్రి జగదీశ్ రెడ్డికి తారసపడ్డ రాకేష్ గురించి తెలుసుకున్న మంత్రి.. కేసీఆర్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పటమే కాక.. తనకు ఒకసారి ఆయన్ను కలిసే అవకాశం ఇప్పించాలని కోరాడు. దీనికి సమ్మతించిన మంత్రి.. రాకేశ్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పాడు. వెంటనే అతన్ని తన ఇంటికి పిలిచిన కేసీఆర్.. భోజనం పెట్టించి మరీ ఆదరించాడు.

ఈ సందర్భంగా రాకేశ్ గీసిన చిత్రాలకు ముచ్చటపడిపోయారు. కంటిచూపు కోల్పోతున్న ఈ బాలుడి దుస్థితికి కదిలిపోయిన కేసీఆర్.. వెనువెంటనే అతని కళ్లకు అవసరమైన ఆపరేషన్ చేయించాలని.. ఈ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిన కేసీఆర్.. రాకేశ్ నోటి వెంట మాట వచ్చేలా ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు. రాకేశ్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఎంత కచ్ఛితంగా ఉంటారో.. అందుకు పూర్తి భిన్నంగా మానవీయ అంశాల విషయాల్లో కేసీఆర్ స్పందనను ప్రతి ఒక్కరూ అభినందించే పరిస్థితి.
Tags:    

Similar News