ఏంది కేసీఆర్.. స‌భ‌ల‌కు ఈ పేర్లేంది?

Update: 2018-09-05 05:38 GMT
టీఆర్ ఎస్ అంటే కేసీఆర్‌.. కేసీఆర్ అంటే టీఆర్ ఎస్. ఆ విష‌యం గురించి ఎవ‌రూ చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అదేరీతిలో టీఆర్ ఎస్ పార్టీ పేరు చెప్పినంత‌నే భారీ బ‌హిరంగ స‌భ‌లు పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌టం తెలిసిందే. బ‌హిరంగ స‌భ‌లు.. ఉప ఎన్నిక‌ల సాయంతో ఒక కొత్త రాష్ట్రాన్ని.. రాజ్యాధికారాన్ని సాధించిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ఒక్క‌టిమాత్ర‌మే.

అలాంటి స్ఫూర్తి ఈ మ‌ధ్య‌న కేసీఆర్ అండ్ కోలో మిస్ అవుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఒక‌ప్పుడు స‌భను నిర్వ‌హిస్తూ.. దాని పేరును ఖ‌రారు చేసినంత‌నే స్ఫూర్తి ర‌గిలేది. ఈ స‌భ అదిరిపోవాలె అన్న‌ట్లు ఉండేది. కానీ.. తాజాగా పెడుతున్న పేర్లు అందుకు భిన్నంగా ఉండ‌ట‌మే కాదు.. వాటిల్లో ఫోర్స్.. వెనుక‌టి ప‌దును క‌నిపించ‌ని దుస్థితి.

2001లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ.. ఆరంభంలోనే సింహ‌గ‌ర్జ‌న పేరుతో విరుచుకుప‌డింది. సంద‌డి చేసింది. కొత్త స్ఫూర్తిని తెలంగాణ‌లో నింపింది. ఇది మొద‌లు 2011లో నిర్వ‌హించిన మ‌హా గ‌ర్జ‌న వ‌ర‌కూ స‌భ పెట్టాలంటే కేసీఆర్ మాత్ర‌మే పెట్టాల‌న్న‌ట్లుగా ఏర్పాట్లు ఉండేవి. స‌భ పెట్టిన ప్ర‌తిసారీ పార్టీ గ్రాఫ్ పెరిగే ప‌రిస్థితి.

2014లో తెలంగాణ ఏర్ప‌డి.. చేతికి ప‌వ‌ర్ వ‌చ్చిన త‌ర్వాత నాలుగు స‌భ‌ల్ని నిర్వ‌హించారు. ఇందులో చివ‌రిది మొన్న ఆదివారం భారీ ఎత్తున నిర్వ‌హించిన ప్ర‌జా నివేద‌న స‌భ‌. గ‌తంలో ఏదైనా స‌భ పెట్టిన‌ప్పుడు ఒక‌ట్రెండు ప‌దాల‌తోనే స‌భ పేరు ఉండేది. కానీ.. చివ‌ర నిర్వ‌హించిన స‌భ‌కు మూడు ప‌దాల్లో పేరుపెట్ట‌టం.. దాన్లో ఫోర్స్ లేదు. పేరుకు త‌గ్గ‌ట్లే స‌భ సైతం నీర‌సంగా సాగ‌ట‌మే కాదు.. కేసీఆర్ స్పీచ్ పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న గులాబీ ద‌ళంలో నిరాశ‌కు గుర‌య్యేలా చేసింది.

ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో మ‌రో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ నెల 7న అంటే శుక్ర‌వారం హుస్నాబాద్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే.. దీనికి ప్ర‌జా నివేద‌న స‌భ మాదిరి ల‌క్ష‌ల్లో కాకుండా వేల‌ల్లో జ‌నం హాజ‌ర‌య్యేలా ప్లాన్ చేస్తున్నారు. తాజా ప్లాప్ షో నేప‌థ్యంలో స్థానికంగా ఉన్న ఊళ్ల మీద‌నే దృష్టి పెట్ట‌టంతో పాటు..రానున్న ముంద‌స్తు ముచ్చ‌ట్లు ఈ స‌భ ద్వారా తెలియ‌జేసే వీలుంద‌ని చెబుతున్నారు. ఇందుకు మంత్రి క‌మ్ మేన‌ల్లుడు హ‌రీశ్ తో పాటు మ‌రో కీల‌క మంత్రి ఈటెల రాజేంద‌ర్ కు ఈ స‌భ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇదంతా బాగానే ఉన్నా... స‌భ‌కు పెట్టిన పేరులోనే తేడా కొడుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

గ‌తంలో భారీ స‌భ‌ల‌కు ఒక‌ట్రెండు ప‌దాల్లో ముగిసేలా.. అదిరిపోయేలా పెట్టిన పేర్ల‌కు భిన్నంగా తాజా స‌భ‌ల పేర్లు నీర‌సంగా ఉన్నాయ‌న్న మాట వినిపిస్తోంది. దీనికి తాజా స‌భ‌కు పెట్టిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌గా పేరు పెట్టారు. గ‌తంలో మాదిరి వైబ్రేష‌న్స్ పేర్ల‌కు లేకుండా పోతోంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.కావాలంటే చరిత్ర‌ను తీసి.. చిట్టా లెక్క‌లు వేస్తే.. గ‌తానికి ఇప్ప‌టికి మ‌ధ్య పేర్లు పెట్టే విష‌యంలో వ‌చ్చిన మార్పు ఏమిటో ఇట్టే తెలుస్తుంది. మ‌రి చిట్టా చూద్దామా?

నాటి నుంచి నేటి వ‌ర‌కూ గులాబీ బ్యాచ్ ప్ర‌ధాన స‌భ‌లు.. వాటి పేర్ల వివ‌రాలు 

17.05.2001 - కరీంనగర్‌ లో సింహగర్జన సభ
17.11.2001 - ఖమ్మంలో ప్రజా గర్జన
27.03.2002 - వికారాబాద్‌ లో శంఖారావం
06.01.2003 -  తెలంగాణ గర్జన సభ ( సికింద్రాబాద్‌ జింఖానా మైదానం)
27.04.2003 - చలో వరంగల్‌ జైత్రయాత్ర సభ
30.06.2003 - చలో జగిత్యాల సభ
24.08.2003 - కొల్లాపూర్‌ లో కోలాహలం సభ
15.09.2003 - నాగర్‌ కర్నూల్‌ లో నగారా సభ
24.10.2003 - మంథనిలో పల్లె బాట సభ
19.11.2003 - సంగారెడ్డిలో సింగూరు సింహగర్జన
21.11.2003 - పాలమూరు సింహగర్జన సభ
03.12.2003 - నిజామాబాద్‌ లో ఇందూరు సింహగర్జన
05.12.2003 - జనగామలో ఓరుగల్లు వీర గర్జన సభ
16.12.2003 - సిరిసిల్లలో కరీంనగర్‌ కదనభేరి సభ
12.02.2006 - భద్రాచలంలో పోలవరం గర్జన సభ
18.10.2006 - సిద్దిపేటలో సమర శంఖారావం
22.12.2006 - నల్లగొండలో ఆత్మగౌరవ సభ
27.04.2007 - వరంగల్‌ లో విశ్వరూప మహాసభ
31.01.2008 - నల్లగొండలో నిరసన సభ
29.12.2008 - నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో విద్యార్థి గర్జన
21.10.2009 - సిద్దిపేటలో తెలంగాణ ఉద్యోగ గర్జన
16.12.2010 - వరంగల్‌ లో టీఆర్ఎస్‌ మహా గర్జన
12.09.2011 - కరీంనగర్‌ లో జన గర్జన సభ
02.09.2018 - కొంగరకలాన్‌ లో ప్రగతి నివేదన సభ
Tags:    

Similar News