కేసీఆర్ .. మోత్కుపల్లి.. ఇద్దరూ ఒకరినొకరు ఎంతలా పొగిడేసుకున్నారంటే?

Update: 2021-10-19 03:52 GMT
అందుకే అంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరని. టీఆర్ఎస్ నేతల్లో దళిత వర్గానికి చెందిన నేతలకు కొదవ లేదు. కానీ.. వారెవరికీ అందించని సమాచారం సీనియర్ నేత మోత్కుపల్లికి ఎందుకు అందించారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేని నేతల్లో ఒకరిగా పేరు పడిన మోత్కుపల్లి సుడిని తిప్పేశారు కేసీఆర్. ఒకప్పుడు బాగా వెలిగిన దీపంగా మాత్రమే మిగిలిన మోత్కుపల్లికి రాజకీయ ప్రయాణాన్ని మార్చేసేలా కేసీఆర్ తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

మోత్కుపల్లి తనకు చాలా సన్నిహితుడని.. దళితబంధు పథకం గురించి అనుకున్న తర్వాత.. తాను మొదట సమాచారం ఇచ్చింది మోత్కుపల్లికే నంటూ కొత్త విషయాన్ని వెల్లడించారు సీఎం కేసీఆర్. తాజాగా పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. మోత్కుపల్లి పరిచయం అవసరం లేని వ్యక్తి అని.. అణగారిన ప్రజల గొంతుకగా ఉన్నట్లు చెప్పారు. తనకు అత్యంత సన్నిహితుడని.. ఇద్దరం ఎన్నో ఏళ్లు కలిసి పని చేసిన వైనాన్ని గుర్తు చేశారు.

తమ స్నేహం రాజకీయాలకు అతీతమైందన్న కేసీఆర్ మోత్కుపల్లిని తెగ పొగిడేశారు. దళితబంధు అమలు గురించి డిసైడ్ అయ్యాక.. ఆయనకు ఫోన్ చేశానని.. మీటింగ్ కు మోత్కుపల్లి వచ్చారని.. యాదాద్రికి కూడా తనతో రావాలని కోరినట్లుగా చెప్పారు. రాజకీయాల్లో ఎన్నేళ్లు ఉంటామన్నది ముఖ్యం కాదని.. ఎంత చేశామన్నది ముఖ్యమని వ్యాఖ్యానించారు. పార్టీలో చేరిన మోత్కుపల్లి చేరికను రాజకీయ చర్యగా చూడొద్దన్న కేసీఆర్.. ఆయన్ను ఆలేరుకు పరిమితం చేయమని.. రాష్ట్ర స్థాయిలో ఉపయోగించుకుంటామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మోత్కుపల్లి విద్యుత్తు మంత్రిగా సేవలు అందించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

తనను ఉద్దేశించి సీఎం కేసీఆర్ అంతలా పొగిడేసిన తర్వాత మోత్కుపల్లి ఉత్తినే ఉంటారా? అందుకే ఆయన్ను ఒక రేంజ్లో పొగిడేశారు. తన అనుభవంలో కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని తానెక్కడా చూడలేదన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్నారని కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నారన్నారు. ప్రజలకు కావాల్సింది పేదల్ని ఆదుకునే నాయకుడని.. కేసీఆర్ లో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కల్యాణలక్ష్మీ.. షాదీ ముబారక్ లాంటి గొప్ప కార్యక్రమాల్ని పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేయటం తన అదృష్టంగా పేర్కొన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ ను ఇంతలా పొగిడేసిన మోత్కుపల్లి.. కొన్నేళ్ల క్రితం ప్రెస్ మీట్ లో ఆయన్ను ఉద్దేశించిన ఘాటు వ్యాఖ్యల్ని గుర్తు తెచ్చుకుంటే.. రాజకీయాలు ఎలా ఉంటాయన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఒక దశలో కేసీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నేతల్లో మోత్కుపల్లి ముందుంటారు. ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలకు సంబంధించి పాత క్లిప్ ఒకటి చూస్తే.. కేసీఆర్ ను ఆయన ఎంతలా విమర్శించింది ఇట్టే అర్థమవుతుంది. ఇంతకూ ఆయన ఏమన్నారంటే.. ‘‘చప్పుడు చేయకు కేసీఆర్. నీలాంటి లత్కోరుగాని ఇంటికి.. పనికిమాలిన వాడి ఇంటికి.. ఈ వెధవ ఇంటికి మేము వస్తామా? అంత చేవ చచ్చిన వాళ్లమా? మా ఇళ్ల చుట్టూ తిరిగి పైకి వచ్చినవాడివి. మా దగ్గరకు వచ్చి పనులు చేయించుకున్నవాడివి. కనీసం స్నేహితులనే ఇంగితం లేకుండా మాట్లాడుతున్నావు. టీడీపీ పెట్టిన భిక్ష వల్ల బతుకుతున్నావు. అది మరిచిపోయి ఈవాళ మాట్లాడుతున్నావు’’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అర్థమైంది కదా.. కాలంతో పాటు.. నేతల మాటల్లోనూ ఎంతలా మార్పు వస్తుందో


Tags:    

Similar News