సీఎంకేనా ఏంది? ఎమ్మెల్యేల‌కూ కొత్త ఇళ్లు రెఢీ!

Update: 2019-01-23 04:33 GMT
కోట్లాడి మ‌రీ తెచ్చుకున్న కొత్త రాష్ట్రంలో అన్ని కొత్త‌గా ఉండాల్సిందే. కొత్త ఒక వింత.. పాత ఒక రోత అని ఊరికే అన‌లేదు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న‌వి ఏవైనా స‌రే.. మారిపోవాల్సిందే అన్న‌ట్లుగా ఉండే కేసీఆర్ కాన్సెప్ట్ కు త‌గ్గ‌ట్లే వంద‌ల కోట్ల‌ను ఖ‌ర్చు చేసి.. అన్ని కొత్త కొత్త‌వి ఏర్పాటు చేయ‌టంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాష్టారు మ‌హా హుషారుగా ఉంటారు.

తొలి ద‌ఫా అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ముఖ్య‌మంత్రి నివాసం త‌న అభిరుచికి త‌గ్గ‌ట్లుగా లేక‌పోవ‌టంతో.. ఆగ‌మేఘాల మీద ప్ర‌గ‌తి భ‌వ‌న్ పేరుతో భారీ భ‌వంతిని నిర్మించ‌టం తెలిసిందే. మ‌హా వైభోగంగా ఉండే ఈ ఇంట్లో గృహ‌ప్ర‌వేశం ఎంత ఆడంబ‌రంగా జ‌రిగిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మేలేదు.

ముఖ్య‌మంత్రుల వారు కొత్త ఇంట్లోకి మారిన‌ప్పుడు.. మ‌రి ఎమ్మెల్యేలు ఏం పాపం చేసుకున్నార‌న్న భావ‌న క‌లుగుతుంది క‌దా. అప్పుడెప్పుడో క‌ట్టిన ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్ లో ఉండ‌టం ఎవ‌రికైనా చిరాకే. ఆ విష‌యాన్ని గుర్తించిన కేసీఆర్‌.. త‌న‌దైన శైలిలో.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల‌కు కొత్త ఇళ్ల‌ను రెఢీ చేసేశారు. అయితే.. ఏదైనా ప‌ద్ద‌తి ప్ర‌కారం చేయ‌టం అల‌వాటైన నేప‌థ్యంలో.. శాస‌న స‌భ సౌక‌ర్యాల క‌మిటీ సిఫార్సులకు త‌గ్గ‌ట్లుగా ఫ్లాట్ల‌ను (హైరేజ్ అపార్ట్ మెంట్ల మాదిరి) సిద్ధం చేశారు. హైద‌ర్ గూడ‌లో కొత్త ఫ్లాట్ల‌ను సిద్ధం చేశారు.

అసెంబ్లీలోని 120 మంది ఎమ్మెల్యేలు.. శాస‌న‌మండ‌లిలో ఉండే 40 మంది ఎమ్మెల్సీలు. ఉన్నారు. ఇక‌.. రెండు స‌భ‌ల అధిప‌తుల‌కు.. మంత్రుల‌కు.. చీప్ విప్ లు.. విప్ ల‌కు వేర్వేరుగా క్వార్ట‌ర్లు కేటాయిస్తున్న నేప‌థ్యంలో మొత్తం 120 ఫ్లాట్ల‌ను సిద్ధం చేశారు. 4.5 ఎక‌రాల విస్తీర్ణంలో అత్యాధునిక వ‌స‌తుల‌తో రూ.166 కోట్ల వ్య‌యంతో 12 అంత‌స్తుల‌తో మొత్తం ఫ్లాట్ల‌ను సిద్ధం చేశారు.

ప్ర‌తి ఫ్లాట్ 2100 చ‌ద‌ర‌పు అడుగుల‌తో విశాలంగా నిర్మించారు. ట్రిపుల్ బెడ్రూంలు సిద్ధం చేశారు. ఎమ్మెల్యేల వ్య‌క్తిగ‌త సిబ్బంది కోసం 36 ఫ్లాట్ల‌ను సిద్దం చేశారు. కొత్త‌గా నిర్మించిన భ‌వ‌న స‌ముదాయంలోనే బ్యాంకు... క్ల‌బ్ హౌజ్.. సూప‌ర్ మార్కెట్ల‌ను ఏర్పాటు చేశారు. మూడు అంత‌స్థుల సెల్లార్ లో 240 వాహ‌నాల‌కు పార్కింగ్ సౌక‌ర్యాన్ని క‌ల్పించేలా ప్లాన్ చేశారు.

ఇక‌.. ఎమ్మెల్యేలను క‌లుసుకునేందుకు వ‌చ్చే విజిట‌ర్స్ తో భేటీ అయ్యేందుకు వీలుగా  ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేల‌కు.. ఎమ్మెల్సీల‌కు కొత్త ఫ్లాట్లు కేటాయిస్తున్నారు క‌దా?  మ‌రి.. పాత భ‌వ‌నాల్ని ఏం చేస్తార‌న్న సందేహం వ‌చ్చిందా? అక్క‌డికే వ‌స్తున్నాం. అక్క‌డే తిష్ట వేసి.. క‌ద‌ల‌కుండా ఉండిపోయిన మాజీ స‌భ్యుల్ని వెంట‌నే ఖాళీ చేయిస్తారు. మ‌రి.. ఆ భ‌వ‌నాల్ని ఏం చేయాల‌న్న అంశంపై ప్ర‌భుత్వం స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ఫ‌ర్లేదు..కొత్త రాష్ట్రంలో ఎమ్మెల్యేల‌కు ఆ మాత్రం కొత్త వ‌స‌తుల్ని ఏర్పాటు చేయ‌టం త‌ప్పేం కాదులే. ఖ‌ర్చు అవుతోంది ప్ర‌జాధ‌న‌మే క‌దా!



Full View

Tags:    

Similar News