సాగర్ ఎన్నికల వేళ.. హైదరాబాద్ లోని నేతలకు కేసీఆర్ కొత్త టాస్కు

Update: 2021-04-01 12:30 GMT
మంట పుట్టించే ఎండలో ఏసీ గదుల్లో సీరియస్ సమీక్షలు జరుపుతూ.. కులాసాగా కాలక్షేపం చేయాల్సిన తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందుకు భిన్నంగా చెమటలు చిందిస్తున్నారు. ఎర్రటి ఎండ తీవ్రతను లెక్క చేయకుండా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. తానే బరిలో నిలిస్తే ఎంతలా కష్టపడతారో.. అంతే కష్టాన్ని ఇప్పుడు తలసాని పడుతున్నారు. ఎందుకిలా? ఆయనకు సాగర్ ఉప ఎన్నికకు లింకేమిటి? అన్న విషయంలోకి వెళితే.. తలసానితో పాటు మరికొందరు నేతలు కూడా ఈ జాబితాలో కనిపిస్తారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సయ్య మరణంతో వచ్చిన సాగర్ ఉప ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లో తమ ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. తెలంగాణలో తమ బలం తగ్గలేదని.. నేటికి తమకు తిరుగులేదన్న విషయాన్ని చాటా చెప్పాలని తపిస్తోంది. ఆ మధ్యన తగిలిన రెండు ఎదురుదెబ్బల్ని.. తాజాగా వెల్లడైన రెండు ఎమ్మెల్సీ ఫలితాలతో బ్యాలెన్సు చేసినా.. సాగర్ ఉప ఎన్నికలో విజయాన్ని సాధించటం ద్వారా తమ అధిక్యత తిరుగులేనిదిగా ఫ్రూవ్ చేయాలని భావిస్తోంది.

అందుకు.. గతంలో మాదిరి తప్పులు దొర్లకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పోల్ మేనేజ్ మెంట్లో సరికొత్త విధానాలకు తెర తీస్తున్న టీఆర్ఎస్.. సాగర్ ఉప ఎన్నికల వేళలోనూ.. సామాజిక వర్గాల వారీగా కొందరు నేతలకు టార్గెట్లు పెట్టటం.. వారి వర్గానికి చెందిన ఓటర్లను ఆకర్షించేలా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసింది. సాగర్ ఓటర్లను కులాల వారీగా చూస్తే.. అత్యధికంగా యాదవ ఓటర్లు ఉంటారు. దాదాపు 36వేలకు పైచిలుకు ఓటర్లు సాగర్ అసెంబ్లీ పరిధిలో ఉన్నారు.

వీరి ఓట్లను కొల్లగొట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ప్రచారానికి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన విపరీతంగా శ్రమిస్తున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన నేతలతో భేటీ కావటం.. వారి ఓట్లను ఆకర్షించేలా కష్టపడుతున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపులో తన భాగస్వామ్యం ఉండేలా చూసుకోవటం ద్వారా అధినేత మనసును దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే.. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని మరీ ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

అత్యధిక ఓటర్లు ఉన్న సామాజిక వర్గాలను మాత్రమే కాదు.. తక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గాలకు చెందిన నేతల్ని ప్రచార గోదాలోకి దించేశారు. మైనార్టీ ఓట్లు కేవలం మూడున్నర వేల వరకే ఉన్నాయి. కానీ.. వారి వర్గానికి ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ సైతం తాజాగా సాగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఇలా పలు సామాజిక వర్గాలకు చెందిన గులాబీ నేతలు సాగర్ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాదు.. ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో నేతను బాధ్యులుగా చేసిన కేసీఆర్.. వారికి కొత్త టార్గెట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన సంఘాలు.. వాటి నేతలతో సమావేశం కావటం.. ఓట్లు తమకే పడేలా ప్లాన్ చేస్తున్నారు. మరి.. కేసీఆర్ ప్లాన్ ఎంతమేర వర్కువుట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News