అందరి చరిత్ర చెప్పి జగన్ ను వదిలేశారేం?

Update: 2015-11-18 04:27 GMT
వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హన్మకొండలో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం తెలిసిందే. తన ప్రసంగంలో భాగంగా.. తెలంగాణలో పెద్దమనిషిగా ఆయన తరచూ వ్యవహరించే జానారెడ్డి.. జైపాల్ రెడ్డిలను ఉతికి ఆరేయటమే కాదు.. వారి ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేయటం తెలిసిందే. వారి చరిత్ర చెబుతానని చెప్పి మరీ.. వారి గతాన్ని ప్రస్తావించటం.. వారిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

జైపాల్ రెడ్డి.. జానారెడ్డి.. చంద్రబాబునాయుడు.. కిషన్ రెడ్డి.. ఇలా ఒకరి తర్వాత ఒకరిని వేసుకున్న కేసీఆర్.. గత రెండు రోజులుగా  ప్రచారం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటను కానీ.. ఆయన చేస్తున్న విమర్శల్ని కానీ అస్సలు ప్రస్తావించకపోవటం గమనార్హం. తనను తిట్టేవారి విషయంలో అందరి పట్లా ఒకే ధర్మాన్ని పాటించిన కేసీఆర్.. జగన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా మినహాయింపు ఇవ్వటం.. అస్సలు పట్టనట్లుగా వ్యవహరించటం విశేషం.

అల అని మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు చేయలేదా? అంటే సోమవారంతో పోలిస్తే.. మరికాస్త ఘాటు పెంచారు. మరి.. విపక్షాలన్నింటిని ప్రస్తావించి.. తనకు తాను పెద్దమనుషులుగా తరచూ ప్రస్తావించే జైపాల్ రెడ్డి.. జానారెడ్డిలను దుమ్మెత్తి పోయటమేకాదు.. తెలంగాణ ఉద్యమంలో వారు చేసిందేమీ లేదని తేల్చిన ఆయన.. జగన్ తనపై చేస్తున్న విమర్శల్ని ఎందుకు ప్రస్తావించనట్లు? అన్న సందేహం వ్యక్తమవుతోంది. 
Tags:    

Similar News