ఆ ఫ్యామిలీకి కేసీఆర్ అపాయింట్ ఇవ్వలేదు

Update: 2016-04-25 16:41 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత విలక్షణమైన వ్యక్తిత్వమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాల్లో ఊహించని చొరవ ప్రదర్శించే ఆయన.. అదే సమయంలో మరికొన్ని అంశాల్లో ఆచితూచి అడుగులు వేస్తుంటారు. ఇంకొన్ని అంశాల్లో అస్సలు దగ్గరకు కూడా రారు.. రానివ్వరు. తాను ఇబ్బంది పడతానని భావించే అంశాల విషయంలో అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు ససేమిరా అనే ముఖ్యమంత్రి కేసీఆర్ తనలోని కరుకు కోణాన్ని ప్రదర్శిస్తారు.

తాజాగా పాలేరు ఉప ఎన్నికకు సంబంధించి కేసీఆర్ వ్యూహానికి ప్రతివ్యూహాలు పన్నుతున్న కాంగ్రెస్ కారణంగా తాజాగా ఆయన ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి.. కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని.. వెంకటరెడ్డి చేసిన కృషికి గుర్తింపుగా తనకు అవకాశం ఇవ్వాలంటూ దివంగత వెంకటరెడ్డి సతీమణి.. పాలేరు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరిత ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాయటం తెలిసిందే. సుచరిత రాసిన లేఖ సీఎం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారిందన్న వాదన వినిపిస్తున్న సమయంలోనే.. తాజాగా వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు సీఎంను వ్యక్తిగతంగా కలిసి పాలేరు ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేలా సహకరించాలని కోరాలని నిర్ణయించారు. ఊహించని ఈ పరిణామానికి ఎలా స్పందించాలన్న అంశంపై సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు. సీఎం అపాయింట్ మెంట్ అడిగిన వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు.. ‘‘ముఖ్యమంత్రికి సమయం లేదు’’ అంటూ ఆయన కార్యాలయం సమాధానం ఇవ్వటం గమనార్హం.
Tags:    

Similar News