బాల‌య్య‌కు 'బొమ్మ‌' క‌న‌బ‌డిన‌ట్టేనా?

Update: 2019-01-08 11:25 GMT
నంద‌మూరి బాల‌కృష్ణ‌... టాలీవుడ్‌ లో అగ్ర క‌థానాయ‌కుడే కాదండోయ్‌... ఏపీలో అధికార పార్టీ టీడీపీ నేత కూడా. అంతేనా... ఆ పార్టీ త‌ర‌ఫున ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కూడానూ. అనంత‌పురం జిల్లా హిందూపురం నుంచి  బ‌రిలోకి దిగిన బాల‌య్య‌... త‌న తండ్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావుకు అక్క‌డ ఉన్న ప్ర‌జాబ‌లంతో ఈజీగానే నెగ్గేశారు. ఇక మొన్న జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా స‌త్తా చాటుదామ‌ని ఆయ‌న బ‌రిలోకి దిగాడు. త‌న తండ్రి ఎన్టీఆర్ ఏ పార్టీకి వ్య‌తిరేకంగా అయితే.. టీడీపీని స్థాపించారో... అదే కాంగ్రెస్ పార్టీతో క‌లిపేసిన ఇప్ప‌టి టీడీపీ అధినేత సిద్ధాంతాలు వ‌దిలేసి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నా... కిక్కురుమ‌న‌కుండా ఆ కూట‌మికి అనుకూలంగా ప్ర‌చారంలోకి దిగిన బాల‌య్య‌... నిజంగానే పెద్ద కామెడీనే చేశారు. ఈ కామెడీ బాగానే పండిపోయింది. త‌న సోద‌రుడి కూతురు సుహాసిని విజ‌యం కోసం కూక‌ట్ ప‌ల్లిలో శ‌క్తికి మించి ప్ర‌చారం చేసిన బాల‌య్య‌... దేశ భ‌క్తి గీతం సారే జ‌హాసే అచ్చా ఆలాప‌న‌లో బుల్ బుల్ అంటూ ప‌లికి త‌న‌ను తాను గోతిలో ప‌డేసుకున్నారు.

ఇదంతా కామెడీ అనుకున్నా... ప్ర‌చారంలో భాగంగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ - ఆయ‌న కుమారుడు కేటీఆర్‌ ల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు. విమ‌ర్శ‌ల‌తో పాటు త‌న సినిమా స్టైల్ డైలాగులు వ‌దిలిన బాల‌య్య‌... వారిద్ద‌రిపైకి ఏకంగా తొడ కూడా కొట్టారు. స‌రే... రాజ‌కీయంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇదంతా మామూలే క‌దా అనుకున్నారంతా. అయితే త‌మ‌ పైకే తొడ‌గొట్టిన బాల‌య్య విష‌యాన్ని కేసీఆర్ అంత ఈజీగా మ‌రిచిపోన‌ట్టుంది. అస‌లు త‌న అభిమాన నటుడు నంద‌మూరి తార‌క‌రామారావు కుమారుడిగా బాల‌య్య‌పైనా - ఆయ‌న సోద‌రుల పైనా కేసీఆర్‌ కు ఆది నుంచి మ‌మ‌కార‌మే. అందుకే... బాల‌య్య సోద‌రుడు హ‌రికృష్ణ మ‌ర‌ణించ‌గానే... ద‌గ్గ‌రుండీ అన్నీ చూసుకున్న కేసీఆర్‌... హ‌రికృష్ణ అంత్యక్రియ‌ల‌ను అధికారికంగా నిర్వ‌హించ‌డ‌మే కాకుండా... హ‌రికృష్ణ స‌మాధి కోసం ఏకంగా స్థ‌లాన్ని కూడా ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇదంతా మ‌రిచిపోయిన బాల‌య్య‌... ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేసీఆర్‌ పైకే తొడ కొట్టేశారు. ఇత‌రుల విష‌యాన్ని అయితే కేసీఆర్ అంత‌గా ప‌ట్టించుకునే వారు కాదేమో గానీ... త‌న అభిమాన న‌టుడు - నేత కుమారుడే త‌న‌పైకి తొడ గొట్ట‌డాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక‌పోయిన‌ట్టుగానే ఉంది. అందుకే... త‌న అభిమాన న‌టుడి బ‌యోపిక్‌ కు ఆయ‌న ప్ర‌త్యేక అనుమ‌తులు మంజూరు చేసే విష‌యాన్ని దాదాపుగా ప‌క్క‌న‌పెట్టేశారు.

బాల‌య్య త‌న తండ్రి ఎన్టీఆర్ పాత్ర‌లో ఇమిడిపోయి న‌టించిన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు రేపు విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని రోజుకు ఆరు ఆట‌ల చొప్పున వారం పాటు ఆడించుకునేందుకు అనుమ‌తించాల‌ని ఆ చిత్ర నిర్మాత హోదాలో బాల‌య్య‌... ఇటు ఏపీ ప్ర‌భుత్వంతో పాటు అటు కేసీఆర్ స‌ర్కారుకు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. స్వ‌యానా బావ‌మ‌రిది - ఆపై వియ్యంకుడు - ఆపై సొంత పార్టీ ఎమ్మెల్యే - త‌న‌కు రాజ‌కీయ భిక్ష పెట్టిన నంద‌మూరి ఫ్యామిలీ వార‌సుడు... ఈ లెక్క‌ల‌న్నింటితో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న విజ‌యానికి బూస్ట్‌ లా ఉప‌యోగ‌ప‌డ‌నున్న ఈ చిత్రానికి చంద్ర‌బాబు ఏపీలో ప‌ర్మిష‌న్ ఇచ్చేశారు. అయితే హైద‌రాబాదు లాంటి మెట్రో సిటీ ఉన్న తెలంగాణ‌లో మాత్రం ఇప్ప‌టిదాకా బాల‌య్య విజ్ఞ‌ప్తికి సానుకూల స్పంద‌న రాలేదు. బాల‌య్య చేసుకున్న ద‌ర‌ఖాస్తును కేసీర్ దాదాపుగా ప‌క్క‌న‌పెట్టేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్ర‌మే స‌మ‌యం ఉన్నా... ఇంకా కేసీఆర్ స‌ర్కారు నుంచి అనుమ‌తి రాలేదంటే... ఇక రావ‌డం క‌ష్ట‌మేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా ఎన్నిక‌ల సంద‌ర్భంగా ముందూ వెనుకా చూసుకోకుండా శివాలెత్తిపోయిన బాల‌య్య‌ ఇప్పుడు ఈ ర‌కంగా మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.


Tags:    

Similar News