మూతబడ్డ పరిశ్రమలకు ఊపిరిపోస్తున్న కేసీఆర్

Update: 2018-09-06 06:58 GMT
రామగుండం ఎరువుల కర్మాగారం, కాగజ్ నగర్ కాగితం పరిశ్రమ.. ఇప్పుడు కమలాపురం కలప, గుజ్జు పరిశ్రమ.. ఈ మూడు.. రెండు దశాబ్దాల క్రితం ఎంతో మందికి ఉపాధినిచ్చిన పరిశ్రమలు.. ఉత్తర తెలంగాణ ఆయువుపట్టుగా ఉండేవి. ఈ కొలువుదీరిన పరిశ్రమలతో ఉత్తర తెలంగాణ పారిశ్రామిక రంగంలో చెరగని ముద్రవేసింది. తెలంగాణ జిల్లాల్లో పరిశ్రమ పురోగతికి పాటుపడ్డాయి. కానీ ఉమ్మడి ప్రభుత్వాలు వీటికి ఎలాంటి సహాయ సహకారాలు అందివ్వలేదు. ప్రోత్సహించిన దాఖలాలు లేవు. కొన్నేళ్లుగా ఉమ్మడి ఏపీని పాలించిన ఆంధ్రా సీఎంలు ఈ పరిశ్రమలను కావాలనే పట్టించుకోకుండా అవి మూతపడేలా చేశారన్నది తెలంగాణ నేతలు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న విమర్శ.. ప్రోత్సహకాలు దక్కక.. మార్కెట్ పరిణామాలతో వేల కోట్ల విలువైన ఈ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. దీక్షలతో కాలం గడిపారు. ఉపాధిలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఈ మూడు పరిశ్రమల వల్ల కార్మికులకే కాదు.. ఆయన నగరాల్లో అనుబంధ పరిశ్రమలు నెలకొల్పి వేలమందికి ఉపాధి లభించింది. వారంతా పరిశ్రమల మూతతో వేరే ఉపాధిని వెతుక్కుంటూ బతుకుజీవుడా అంటూ తరలిపోయారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై కాగజ్ నగర్ పరిశ్రమను పునరుద్దరించాలంటూ టీఆర్ఎస్ నేతలు ఎంత పోరాడినా సర్కారు కనికరించలేదు. అలాగే మెట్ పల్లి నిజాం చక్కెర కర్మాగారంపై కూడా సర్కారు సీతకన్ను వేసింది. అదే సమయంలో ఏపీలోని పరిశ్రమలకు పునరుజ్జీవం - నిధులు కల్పించి తెలంగాణ పరిశ్రమలను మూత పడేలా చేశారన్నది టీఆర్ఎస్ నేతల ఆరోపణ..

కానీ ఇప్పుడు వచ్చింది తెలంగాణ సర్కారు. పట్టువదలని విక్రమార్కులులాగా టీఆర్ఎస్ నేతలు ఒక్కో పరిశ్రమను పునరుద్దరిస్తూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆయా నగరాలకు మళ్లీ పరిశ్రమ కళను తెస్తున్నారు.. మొదటగా కేంద్రంతో మాట్లాడి రామగుండం పరిశ్రమను తెరిపించిన టీ సర్కారు.. దాన్ని పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఇటీవలే కాగజ్ నగర్ పేపర్ మిల్లుకు నిధులు, రాయితీలు ప్రకటించి దాని పునరుద్దరణకు నడుం బిగించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముంగపేట మండలం కమలాపురం లో  మూతపడ్డ బిల్ట్ కర్మాగారానికి   పునరుజ్జీవం ఇవ్వడానికి రెడీ అయ్యింది. రూ.350 కోట్లతో రాయితీలు ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. దీంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో మళ్లీ పారిశ్రామికికీరణకు అడుగులు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో పరిశ్రమలకు బీజం పడుతోంది. పాత కర్మాగారాల పునురద్దరణ, కొత్త పరిశ్రమలతో తెలంగాణ ఓ కొత్త రూపు సంతరించుకుంటోంది. కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాలు జనాల్లో ఆయనకు మంచి పేరు ను తీసుకొస్తున్నాయి.
    

Tags:    

Similar News