నీళ్లు వాడుకుందాం స‌రే.. హైద‌రాబాద్ ఆదాయం మాట‌?

Update: 2019-07-02 05:57 GMT
తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మానికి నీళ్లు.. నిధులు.. నియ‌మ‌కాలలో జ‌రిగిన న‌ష్టాన్ని పూరించుకునేందుకే. అలాంటి వాటిల్లో తొలి అంశమైన నీళ్ల‌పై తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిపాద‌న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. విడిపోయి క‌లిసి ఉందామ‌న్న మాట‌కు భిన్నంగా విడిపోయిన త‌ర్వాత కూడా క‌లిసి నీళ్లు పంచుకుందామ‌న్న మాట‌పై బోలెడ‌న్ని సందేహాల‌తో పాటు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి ప‌లు సందేహాల్ని విసురుతున్నారు.

మొన్న‌టి దాకా.. మీ నీళ్లు.. మా నీళ్లు అన్న కేసీఆర్ ఇప్పుడు మ‌న నీళ్లు అని చెప్ప‌టం ఏమిటి? అన్న ప్ర‌శ్నను సంధిస్తున్నారు. ఎవ‌రి బ‌తుకులు వాళ్లు బ‌తుకుతున్న‌ప్పుడు.. ఇప్పు  కొత్త లెక్క‌లు ఎందుకు? అన్న‌ది మ‌రో సందేహం. ఒక‌సారి భాగ‌స్వామ్య వ్యాపారం తేడా వ‌చ్చి ఎవ‌రి దారిన వాళ్లు చూసుకుంటున్న‌ప్పుడు.. ఇప్పుడు మ‌ళ్లీ క‌లిసి భాగ‌స్వామ్య వ్యాపారం చేద్దామ‌న్న ప్ర‌తిపాద‌న కేసీఆర్ నుంచి రావ‌టాన్ని త‌ప్పుప‌డుతున్నారు.

విభ‌జ‌న సంద‌ర్భంగా మోసం చేశామ‌ని అదే ప‌నిగా ఆంధ్రోళ్ల‌ను తిట్టేసిన కేసీఆర్‌.. ఈ రోజున గోదావ‌రి నీళ్ల‌ను తీసుకొచ్చి కృష్ణ‌లో క‌లుపుకొని ఇరురాష్ట్రాలు క‌లిసి వాడుకుందామ‌న్న మాట‌పై బోలెడ‌న్ని అనుమానాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. క‌లిసి నీళ్ల‌ను వాడుకుందామ‌ని ప్ర‌తిపాదించే కేసీఆర్‌..ఉమ్మ‌డిగా ఉన్న‌ప్పుడు క‌లిసి పెంచి పెద్ద చేసుకున్న రాజ‌ధాని హైద‌రాబాద్ ఆదాయాన్ని కూడా క‌లిసి పంచుకుందామ‌న్న ప్ర‌తిపాద‌న‌కు ఒప్పుకుంటారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రో నాలుగైదు కంపెనీలు ఉమ్మ‌డిగా క‌లిసి తెచ్చి హైద‌రాబాద్ లో పెడ‌దాం. హైద‌రాబాద్ ఆదాయాన్ని రెండు రాష్ట్రాలు పంచుకుంటే బాగుంటుంది క‌దా? అన్న ప్ర‌తిపాద‌న‌ను కేసీఆర్ ముందుకు తెస్తే ఆయ‌న రియాక్ష‌న్ ఎలా ఉంటుందో?  నీళ్ల‌ను క‌లిసి వాడుకునే విష‌యంలోనూ అలానే ఉంటుంద‌న్న మాట కొంద‌రి నోట వినిపిస్తోంది. అయినా.. లేనిపోని లింకులు ఇప్పుడెందుకు? 

కాస్త క‌ష్ట‌మో.. న‌ష్ట‌మో.. లాభ‌మో ఎవ‌రి దారిన వాళ్లు ఉన్న‌ప్పుడు.. ఎవ‌రికి తోచిన ప్రాజెక్టు వారు ఎవ‌రి రాష్ట్రంలో వారు ఏర్పాటు చేసుకుంటే పోయే దానికి.. ఇప్పుడు ఉమ్మ‌డి పేరుతో కొత్త లొల్లికి శ్రీ‌కారం చుట్టొద్ద‌న్న మాట వినిపిస్తోంది. ఇవాళ బాగుంది కాబ‌ట్టి.. అంతా ఓకే. రేపొద్దున నేత‌ల మ‌ధ్య తేడాలొస్తే.. ఎవ‌రికి వారు ప్ర‌జ‌ల్ని భావోద్వేగంలో ముంచేసి ఫుట్ బాల్ ఆడేసుకునే ప‌రిస్థితి. భ‌విష్య‌త్తులో ఒక‌రిపై ఒక‌రు నింద‌లు వేసుకునే క‌న్నా.. మీ ఇంట్లో మీరు.. మా ఇంట్లో మేము అన్న‌ట్లు ఉంటే మంచిద‌న్న మాట ప‌లువురి నోట వినిపించ‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. ఈ త‌ర‌హా వాద‌న‌పై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో..?


Tags:    

Similar News