కేసీఆర్ కూడా బాబు తప్పే చేయాలా?

Update: 2016-03-12 04:49 GMT
ఛంద్రబాబు మీద రాజకీయంగా విమర్శలు చేయాల్సి వస్తే ఆయన ప్రత్యర్థులు చాలా ఉత్సాహంగా మాట్లాడతారు. ఆయన చేసిన ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతారు. ఒకవేళ.. చంద్రబాబు నిజంగానే తప్పు చేశారనే అనుకుందాం. అలాంటప్పుడు అదే తప్పును మళ్లీ చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ.. ఇలాంటి మాటకు బాబు ప్రత్యర్థులు అస్సలు స్పందించరు. ఒకవేళ తట్టి అడిగినా.. తమకేం అర్థం కానట్లుగా తమ వాదననే కొనసాగిచంటం కనిపిస్తుంది.

తమకు నచ్చని విషయాల్లో బాబు మీద విరుచుకుపడే వారు.. తమకు అనుకూలంగా ఉండే విషయాల్లో మాత్రం బాబు ఉదాహరణ చూపించటం కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో బాబును ఆదర్శమన్నట్లుగా చూపించే వారు.. తిట్టే విషయానికి వచ్చినప్పుడు.. ఎలాంటి మొహమాటం లేకుండా తిట్టేస్తుంటారు. ఒకవైపు బాబు విధానాలు తప్పు అని చెప్పేవారు.. కొన్ని విషయాల్లో మాత్రం భిన్నంగా ఎందుకు వ్యవహరించటం అన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి.

తాజాగా తెలంగాణ అధికారపక్షం వైఖరినే చూద్దాం. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా.. టీటీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేల్ని తమతో తీసుకెళ్లిన కేసీఆర్.. ఇటీవల ఆ ప్రక్రియను విలీనం పేరిట అధికారికంగా మార్చేశారు. ఈ మార్పుతో.. అసెంబ్లీలో సీట్లను మార్చాల్సిన పరిస్థితి. ఇందుకోసం కసరత్తు చేసిన తెలంగాణ అధికారపక్షం.. ప్రస్తుతం ముగ్గురు సభ్యులున్న టీటీడీపీకి శాసనసభాపక్ష నేతగా రేవంత్ రెడ్డికి ముందు వరుసలోకాకుండా వెనుక వరుసలో సీటు కేటాయించారు. అదేమంటే.. బాబు పాలనలో ఐదుగురికి మించి ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ శాసనసభాపక్ష నేతలకే ముందు వరుసలో కూర్చునేలా చంద్రబాబు నిర్ణయాన్ని తీసుకున్నామని.. ఉమ్మడి రాష్ట్రంలో అమలు అయిన విధానాన్నే అమలు చేశామే తప్పించి.. తమకు తాముగా సొంతంగా ఏమీ మార్పులు చేయలేదంటూ చెబుతున్నారు.

ప్రతి విషయంలో చంద్రబాబును విమర్శించే వారు.. ఆయన్ను ఫాలో కావటంలో అర్థం లేదు. ప్రతి నిర్ణయంలోనూ బాబును ఎక్కెసం చేసేవాళ్లు.. బాబు జమానాను ఫాలో కావటం ఎందుకు? తమకు అనుకూలంగా ఉన్న విషయాల్లో బాబు నడిచిన బాటలోనే తాము నడుస్తున్నట్లుగా చెప్పటం.. అందుకు భిన్నంగా ఉన్న విషయాల్లో బాబును తిట్టి పోసే తీరు చూస్తే.. అసలు రాజకీయం ఇట్టే అర్థమవుతుంది. అయినా.. బాబు మాదిరే కేసీఆర్ తప్పులు చేయాల్సిన అవసరం లేదేమో..?
Tags:    

Similar News