25ల‌క్ష‌ల‌తో కేసీఆర్ భారీ బ‌హిరంగ స‌భ‌!

Update: 2018-04-09 04:36 GMT
భారీత‌నానికి పెట్టింది పేరు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. చేస్తే అదిరిపోవాల‌న్న‌ట్లుగా ఆయ‌న తీరు ఉంటుంది. ఎన్నిక‌ల‌కు ఏడు నెల‌ల ముందు నిర్వ‌హించే భారీ బ‌హిరంగ స‌భ విప‌క్షాల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా.. ఆత్మ‌విశ్వాసం స‌న్న‌గిల్లేలా.. స‌మ‌రోత్సాహం నీరు కారేలా ఉండాల‌న్న లక్ష్యంతో స‌భ‌ను ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్‌. ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో ఈ భారీ బ‌హిరంగ స‌భ ఉండాల‌న్న భావ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం 2010 డిసెంబ‌రు 16న వరంగ‌ల్ లో నిర్వ‌హించిన మ‌హాగ‌ర్జ‌న ఏరీతిలో అయితే కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందో.. అదే రీతిలో రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం వేదిక‌గా భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు.

జాతీయ రాజ‌కీయాల్లో త‌న మార్క్ చూపించాల‌ని త‌పిస్తున్న కేసీఆర్‌..తాజా స‌భ‌తో త‌న స‌త్తా చాటాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స‌భ‌కు త‌న‌తో క‌లిసి వ‌చ్చే జాతీయ నాయ‌కుల్ని కూడా తీసుకురావాల‌ని..త‌ద్వారా  తెలంగాణ‌లో త‌న‌కున్న బ‌లాన్ని.. బ‌ల‌గాన్ని చూపించాల‌న్న ఉద్దేశం కేసీఆర్ లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

25ల‌క్ష‌ల మంది జ‌న‌స‌మీక‌ర‌ణ అంటే మాట‌లు కాదు. ఇంత‌మందిని ఎలా స‌మీక‌రిస్తార‌న్న విష‌యానికి వ‌స్తే.. ఇందు కోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ఉన్న‌ట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31 జిల్లాల నుంచి ప్ర‌త్యేకంగా వాహ‌న స‌దుపాయాన్ని ఏర్పాటు చేసి భారీ జ‌న‌స‌మీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో దాదాపు 2వేల ఎక‌రాల స్థ‌లంలో ఈ భారీ బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఈ స‌భ‌కు అవ‌స‌ర‌మైన భూమిని ఎంపిక చేసేందుకు టీఆర్ ఎస్ యంత్రాంగం ఇప్ప‌టికే రంగంలోకి దిగిన‌ట్లుగా తెలుస్తోంది. 25 ల‌క్ష‌ల మందిని స‌భ‌లో ఉంచేందుకు అవ‌స‌ర‌మైన ప్రాంతం ఏదైతే బాగుంటుంద‌న్న అంశంపై ఇంకా త‌ర్జ‌న‌భ‌ర్జ‌లు సాగుతున్న‌ట్లుగా చెబుతున్నారు. జ‌న‌సమీక‌ర‌ణ ఒక‌టైతే.. తెలంగాణ వ్యాప్తంగా వ‌చ్చే వారికి వాహ‌న ఏర్పాట్లు.. వారు వాహ‌నంలో వ‌చ్చి.. స‌భ‌కు హాజ‌రై.. తిరిగి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు అనువుగా ఉండాల‌ని భావిస్తున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయనున్న‌ట్లు చెబుతున్నారు.

అక్టోబ‌రు.. న‌వంబ‌రుల‌లో కానీ ఈ భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయాల‌ని.. ఈ స‌భ కోసం వివిధ పార్టీల జాతీయ నేత‌లు.. వివిధ‌ రాష్ట్రాల‌కు చెందిన ప్రాంతీయ పార్టీల‌ ముఖ్య‌ల్ని తీసుకురావ‌టం ద్వారా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని దూకుడుగా మొద‌లెట్టాల‌ని భావిస్తున్నారు. ఈ స‌భ ద్వారా తెలంగాణ స‌ర్కారు అభివృద్ధిలో ఎలా దూసుకెళ్లింద‌న్న విష‌యాన్ని చెప్ప‌టంతో పాటు.. సంక్షేమానికి ఎంత పెద్ద‌పీట వేసింద‌న్న విష‌యంపై భారీ ప్ర‌చారం క‌ల్పించేందుకు వీలుగా ఈ స‌భ ఉప‌క‌రిస్తుంద‌ని భావిస్తున్నారు.

అంతేకాదు..సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌మ‌కు తిరుగులేని మెజార్టీతో గెలిపిస్తే..తామేం చేయాల‌నుకుంటున్న అంశాల్ని ప్ర‌స్తావించే వీలుంద‌ని..ఎన్నిక‌ల‌కు ముందు నిర్వ‌హించే ఈ భారీ బ‌హిరంగ స‌భ‌లో ఎన్నిక‌ల హామీల‌కు సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. రాష్ట్రంలోని విప‌క్షాల‌కు నోట మాట రాని రీతిలో..ఎన్నిక‌ల పోరుకు ముందే చేతులు ఎత్తేసేలా స‌భ ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 25ల‌క్ష‌ల మందిని స‌భ‌కు తీసుకురావ‌ట‌మ‌న్న ల‌క్ష్యానికి కేసీఆర్ ఎంత చేరువ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News