మేనల్లుడు హరీశ్ కు ప్రమోషన్ ఇచ్చిన కేసీఆర్

Update: 2021-11-10 05:43 GMT
ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు మంత్రి కమ్ మేనల్లుడు హరీశ్ కు ప్రమోషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి కమ్ మేనమామ కేసీఆర్. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న హరీశ్ కు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను కట్టబెడుతూ నిర్నయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయాన్ని మంగళవారం కాస్తంత పొద్దుపోయిన తర్వాత ప్రకటించారు. అధికారిక ఉత్తర్వుల ప్రకారం హరీశ్ ను వైద్య ఆరోగ్య మంత్రిగా తీసుకున్న నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయాన్నిసాధించిన ఈటల రాజేందర్ ఈ రోజు (బుధవారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. దానికి కొద్ది గంటల ముందు హరీశ్ కు ఈటల నిర్వహించిన మంత్రిత్వ శాఖను కట్టబెట్టటం విశేషం. ప్రస్తుతం వైద్య ఆరోగ్య మంత్రి పోర్టుఫోలియోను సీఎం కేసీఆర్ తన వద్దనే ఉంచుకొని.. హరీశ్.. తలసాని తదితరులతో పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖను ఎట్టి పరిస్థితుల్లో హరీశ్ కే అప్పగిస్తారన్న ప్రచారం సాగింది. అందుకు తగ్గట్లే.. తాజాగా ఆ శాఖ ఆయన చేతికి రావటం చర్చనీయాంశంగా మారింది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ.. ఈటల రాజేందర్ పై సంచలన వ్యాఖ్యలు చేయటంతో పాటు.. పార్టీ విజయం కోసం హరీశ్ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. వాస్తవానికి ఈటలను తీవ్రంగా తప్పు పడుతూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని పలువురు తప్పుపట్టారు కూడా. ఒకప్పుడు ఈటలకు ఎంతో సన్నిహితుడైన హరీశ్.. తేడా వచ్చిన తర్వాత మాటల కత్తిని బయటకు తీసి.. మేనమామ ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయటం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించిన తీరును విభేదించిన వారు లేకపోలేదు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు.

తనను తీవ్రంగా విమర్శిస్తున్న హరీశ్ వైఖరిని ఈటల తప్పు పట్టటమే కాదు.. తనకు పట్టిన గతే హరీశ్ కు పడుతుందని వ్యాఖ్యానించారు. విచిత్రమైన విషయం ఏమంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తేడా కొట్టిన నేపథ్యంలో హరీశ్ కు టీఆర్ఎస్ లో ప్రాధాన్యత తగ్గుతుందని అందరూ అంచనా వేశారు. అందుకు భిన్నంగా.. కేసీఆర్ హరీశ్ కు ప్రమోషన్ ఇచ్చిన వైనం పార్టీలో ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News