జంప్ జిలానీ ఎంపీకి ప‌ద‌వి రెడీ చేసిన కేసీఆర్‌

Update: 2018-02-22 16:52 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా నిరీక్ష‌ణ‌లో ఉంచిన జంపింగ్‌ నేత‌కు ప‌ద‌వి ఇచ్చేందుకు ఓకే చెప్పేశారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌గా ఉండి ఆ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేందుకు స‌ర్వం సిద్ధం చేశారు. కాంగ్రెస్ ఎంపీగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ పై పోరాటం చేసిన గుత్తా అనంత‌రం గులాబీ గూటికి చేరిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న్ను మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటార‌ని ఓ సారి....కాదు కార్పొరేష‌న్ చైర్మ‌న్ అని మ‌రోసారి..ఇలా వార్త‌లు వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు..రైతు స‌మ‌న్వ‌య స‌మితికి చైర్మ‌న్‌ గా చేయ‌నున్నార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

అయితే ఆ విష‌యంలో స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డం..నిరీక్ష‌ణ ప‌ర్వంతో గుత్తా వ‌ర్గీయుల్లో ఆందోళ‌న కనిపించింది. అయితే ఎట్ట‌కేల‌కు గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. రైతు సమన్వయ సమితుల నిర్మాణం - విధులు - బాధ్యతలు నిర్ణయించడంతో పాటు ఈ నెల 25 - 26 తేదీల్లో నిర్వహించే ప్రాంతీయ సదస్సులపై ప్రగతి భవన్‌ లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరిట రాష్ట్రంలో కొత్త కార్పోరేషన్ ప్రారంభించాలని సూచించారు. వ్యవసాయాభివృద్ధి - రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో ఈ కార్పోరేషన్ పనిచేస్తుంది. లాభాపేక్ష లేని సంస్థ లాగా కార్పోరేషన్ పనిచేస్తుంది. ఈ సంస్థకు సమకూరిన నిధులను సంస్థ ఏర్పాటు చేసిన లక్ష్యాల సాధన కోసమే వినియోగిస్తారని తెలిపారు. గ్రామ - మండల రైతు సమన్వయ సమితుల మాదిరిగానే త్వరలోనే జిల్లా - రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటవుతాయని పేర్కొన్నారు.

కాగా, ప్రభుత్వం 42 మంది సభ్యులతో రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమితిలో 30 జిల్లాలకు చెందిన ప్రతినిధులు - వ్యవసాయ శాఖ అధికారులకు ప్రాతినిధ్యం కల్పించనుంది. రాష్ట్రస్థాయి సమితిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు - వ్యవసాయ నిపుణులకు చోటు కల్పించనుంది. ఈ స‌మితి చైర్మ‌న్‌ గా గుత్తాకే చాన్స్ ఇస్తార‌ని బ‌లంగా ప‌లువురు పేర్కొంటున్నారు. త‌ద్వారా గుత్తా నిరీక్షణ‌కు తెర‌ప‌డ‌నుందని స‌మాచారం.
Tags:    

Similar News