చాకిరేవు పెట్టేందుకు కేసీఆర్ ప్రిపరేషన్

Update: 2016-08-20 11:57 GMT
తనను తప్పు పట్టిన వారి విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఆగ్రహంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పక్షంలో వెనువెంటనే స్పందించేతత్వం ఆయనకు కాస్త ఎక్కువే. కొన్నిసార్లు ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారో.. మరికొన్నిసార్లు అంతకు రెట్టింపు స్లోగా స్పందించటం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. అర్థం కాని విధంగా.. అంచనాకు దొరకని రీతిలో వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా ఒక అంశంపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొన్నన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వాస్తవ జలదృశ్యం కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పట్టిన సంగతి తెలిసిందే. దేశ చరిత్రలోనే అత్యంత భారీ కుంభకోణం ఒకటి చోటు చేసుకుందని.. రూ.1.5లక్షల కోట్ల కుంభకోణంలో కేసీఆర్ బాధ్యుడంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. మరింత భారీగా ఆరోపణల తర్వాత కూడా ఆయన కామ్ గా ఉండటం పలువురిని విస్మయానికి గురి చేసింది. మాటకు మాట అన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్.. అందుకు భిన్నంగా నిశ్శబద్దంగా ఉన్నారంటే ఆయన మనసులో మరేదో ఉందన్నది నిజం. దీనికి తగ్గట్లే తెలంగాణ కాంగ్రెస్ వాస్తవ జలదృశ్యం మీద ఏ ఒక్క టీఆర్ ఎస్ నేత కూడా మాట్లాడింది లేదు.  

తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కేసీఆర్ అండ్ కో ఏ మాట మాట్లాడకుండా ఉన్నారంట.. అది కచ్ఛితంగా తుఫాను ముందు ప్రశాంతతే అన్న మాటను టీఆర్ ఎస్ నేతలు పలువురు తమ అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. సుదీర్ఘంగా సాగిన తెలంగాణ కాంగ్రెస్ వాస్తవ జలదృశ్యం మీద కౌంటర్ ఎటాక్ ఒక రేంజ్లో ఉంటుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కౌంటర్ ఎటాక్ చేస్తారని చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల మీద కసరత్తు జరుగుతోందని.. అన్నింటికి డీటైల్డ్ గా సమాధానం ఇస్తారంటున్నారు. చాకిరేవు తరహాలో కాంగ్రెస్ విమర్శల్ని.. ఆరోపణల్ని తీవ్రస్థాయిలో ఖండించటం ఖాయమంటున్నారు. అయితే.. ఈ కార్యక్రమం ఎప్పుడు ఉంటుందన్న విషయాన్ని చెప్పలేకపోతున్న నేతలు.. త్వరలోనే అది ఉంటుందని చెబుతున్నారు.
Tags:    

Similar News