సంపన్నుడి పేదరికపు మాటలు సూపర్

Update: 2016-01-07 05:59 GMT
మేం సంపన్నులమని చెప్పే దమ్ము.. ధైర్యం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. ఆ విషయాన్ని చెప్పటానికి ఆయన అస్సలు వెనుకాడరు. సంపన్నులమని చెప్పిన తర్వాత.. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటానికి సమస్యలు ఉంటాయని సాధారణంగా నేతలు ఆలోచిస్తుంటారు. సంపన్నులకు మాత్రం ఆర్థిక కష్టాలు ఉండవా? అన్న చందంగా దబాయించి మరి.. తమ అవసరాల కోసం నిధులు డిమాండ్ చేసే తత్వం కేసీఆర్ సొంతం.

డబ్బులున్నోళ్లమని చెప్పుకొని.. తమ అవసరాల కోసం నిధులు ఇవ్వాలని కేంద్రానికి అడగటం కష్టంగా భావిస్తారు. కానీ.. కేసీఆర్ అందుకు భిన్నం. తమది సంపన్న రాష్ట్రమని ఒకపక్క చెబుతూనే.. మరోపక్క సమస్యలు ఏకరువు పెట్టటం.. తమకు ఆర్థిక చేయూత ఇవ్వాలని డిమాండ్ చేయటం.. అవసరానికి తగినట్లుగా ఒత్తిడి తీసుకురావటం లాంటివి ఆయనకు మాత్రమే చెల్లుతాయని చెప్పాలి.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాటల్నే చూస్తే.. బీహార్.. జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించినప్పుడు.. తమకు ఎందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వరని ప్రశ్నించటమే కాదు.. అలా తెచ్చే సత్తా మీకుందా? అని బీజేపీ నేతలకు సవాలు విసురుతూ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. ఓపక్క ఆయా రాష్ట్రాలకు ప్రకటించినట్లుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని తెలంగాణ కమలనాథుల మీద ఒత్తిడి చేసే తెలంగాణ అధికారపక్షం.. మరోవైపు హైదరాబాద్ మహానగరానికి రూ.20వేల కోట్ల ప్యాకేజీ ఎందుకు తీసుకురారని దబాయిస్తుంటారు.

ఇదిలా ఉండగా.. వివిధ ప్రాజెక్టుల విషయంలో తమకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. తమది కొత్తగా ఏర్పడిన రాష్ట్రమంటూ సమస్యలు ఏకరువు పెడుతుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మధ్యన ఒక కార్యక్రమానికి విచ్చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అర్థమయ్యే హిందీలో మాట్లాడిన కేసీఆర్.. తమకు సాయం చేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటామని.. తమకు ధోకా ఇచ్చే వారిని విడిచిపెట్టమంటూ సభా పూర్వకంగానే సుతి మెత్తని హెచ్చరికలు చేసేశారు.

ఇలా.. ఓపక్క సంపన్నులమని చెబుతూనే మరోపక్క.. తమకు సాయం చేయాలంటూ డిమాండ్ల మీద డిమాండ్లను తెరపైకి తెచ్చేస్తుంటారు. ఇదంతా చూసినప్పుడు కేసీఆర్ వ్యూహచతురత పట్ల ముచ్చటేయక మానదు. తాజాగా నీతిఅయోగ్ ను కలిసిన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బృందం తెలంగాణ రాష్ట్రానికి రూ.30వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరింది. ఇలా అవకాశం ఉన్న ప్రతిచోట.. ఎంత అవకాశం ఉంటే అంతగా నిధులు తీసుకురావటానికి తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న విధానాన్ని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న భావన కలగక మానదు. కోట్లాడి సాధించుకునే కేసీఆర్ తత్వం చంద్రబాబుకు ఎంతవరకు నప్పుతుందో..?
Tags:    

Similar News