ఆ న‌లుగుర్ని కేసీఆర్ ఎలా తెస్తారు?

Update: 2019-03-04 04:32 GMT
కోరుకున్న‌ది సొంతం కావాలి. ఇలాంటి ఆశ అంద‌రికి ఉంటుంది. అయితే.. ఆ ఆశ‌కు హ‌ద్దు ఉండాలి. త‌మ‌కు సంబంధం లేని దానిని.. అర్హ‌త లేని వాటిని సొంతం చేసుకోవ‌టం  త‌ప్పే. ఇవాల్టి రోజున నైతిక‌త లాంటి పెద్ద పెద్ద ప‌దాలు రాజ‌కీయాల్లో క‌నిపించ‌వు. త‌మ‌కు అర్హ‌త లేని వాటిని సొంతం చేసుకోవ‌టానికి కొన్నిసార్లు ఓట్ల‌కు నోటు కేసు లాంటి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి రావొచ్చు. అయితే.. ఏ విష‌య‌మైతే త‌ప్పు.. త‌ప్పు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారో.. ఇప్పుడు అదే త‌ప్పును కేసీఆర్ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి.

తాను అనుకున్న‌ది పూర్తి కావాల్సిందే.. అది ఎలా అయినా స‌రే అన్న‌ట్లుగా ఉంటుంది కేసీఆర్ తీరు. ఆయ‌న ఒక‌సారి ఫిక్స్ అయితే దాన్ని మార్చ‌టం ఎవ‌రి త‌రం కాద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. కేసీఆర్ లో ఉన్న గొప్ప‌త‌నం ఏమిటంటే.. తాను అనుకున్న‌ది సాధించేందుకు ఆయ‌న ప‌న్నే వ్యూహం ప‌క్కాగా ఉండ‌ట‌మే కాదు.. ప్ర‌త్య‌ర్థులు త‌ల బ‌ద్ధ‌లు కొట్టినా.. అలా జ‌ర‌గ‌కుండా ఆప‌లేన‌ట్లుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి వ్యూహాన్నే కేసీఆర్ అమ‌లు చేసే ప్ర‌య‌త్నంలో త‌ల‌మున‌క‌లై ఉన్న‌ట్లు చెబుతున్నారు.

మిగిలిన విష‌యాల్లో ఎలా ఉన్నా రాజ‌కీయాల్లో.. అందునా ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో ఎలాంటి క‌నిక‌రం ఉండ‌కూడ‌ద‌న్న‌ట్లుగా  ప‌రిస్థితులు ఉన్నాయి. కేసీఆర్ సంగ‌తే చూడండి. ఆయ‌న‌కు అసెంబ్లీలో తిరుగులేని అధిక్య‌త ఉంది. క‌నుచూపు మేర ఆయ‌న అధికారాన్ని క్వ‌శ్చ‌న్ చేసే వారే క‌నిపించ‌రు. అయిన‌ప్ప‌టికీ.. అంతా తాను త‌ప్పించి మ‌రెవ‌రూ ఉండ‌కూద‌న్న‌ట్లుగా ఆయ‌న తీరు ఉంటుంది. తాజాగా జ‌రుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు స్థానాల్ని తాము సొంతం చేసుకోవాల‌ని త‌పిస్తున్నారు.

టీఆర్ ఎస్‌ కున్న బ‌లం ప్ర‌కారం న‌లుగురు ఎమ్మెల్సీల‌ను గెలిపించుకునే వీలు ఉంది. మ‌రి.. అలాంట‌ప్పుడు ఐదో స్థానం మీద ఆశ ఎందుకంటే.. ప్ర‌త్య‌ర్థి ఉనికే లేకుండా చేస్తే.. భ‌విష్య‌త్తులో మ‌రింత బ‌లోపేతం కావొచ్చ‌న్న ఆలోచ‌నగా చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే.. తాజా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అంకెల ప్రాధాన్యం చాలా ఎక్కువ‌. మ‌రి.. అంకెల్ని కేసీఆర్ ఎలా మేనేజ్ చేస్తారు?  ఎలాంటి మేజిక్ ను ఆయ‌న ప్ర‌ద‌ర్శిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.టీడీపీకి ప్ర‌స్తుతం స‌భ‌లో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉండ‌గా.. సండ్ర ఇప్ప‌టికే గులాబీ కారు ఎక్కేయ‌నున్న‌ట్లుగా చెప్పేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భాగంగానే ఆయ‌న నోట ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సండ్ర ఎంట్రీతో కేసీఆర్ కు అవ‌స‌ర‌మైన ఐదుగురు ఎమ్మెల్యేలు స‌రిపోరు. మ‌రో న‌లుగురి అవ‌స‌రం ఉంది. అదెలానంటే..ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ కు స‌భ‌లో ఉన్న ఎమ్మెల్యేలు 91 మంది.

వీరికి మిత్ర‌పక్షంగా ఉన్న మ‌జ్లిస్ ఎమ్మెల్యేలు ఏడుగురు ఉన్నారు. దీంతో.. మొత్తం బ‌లం 98 మంది అవుతారు. దీనికి అద‌నంగా తాజాగా టీఆర్ ఎస్ లో చేర‌నున్న‌ట్లుగా ముగ్గురు ఎమ్మెల్యేలు ప్ర‌క‌టించారు. అంతే మొత్తం బ‌లం 101కి చేరుకుంటుంది.

కేసీఆర్ కోరుకుంటున్న‌ట్లుగా ఐదు ఎమ్మెల్సీలు త‌మ‌కే చెందాల‌నుకుంటే.. వారికి మొత్తం 105 ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కావాలి. ఒక్కో స‌భ్యుడికి 21 మంది ఎమ్మెల్యేల చొప్పున 105 మంది అవ‌స‌రం. కానీ.. ఉన్న‌ది 101 మంది మాత్ర‌మే. మ‌రి.. మిగిలిన న‌లుగురు కోసం కేసీఆర్ ఏం చేయ‌నున్నారు? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇక‌.. కేసీఆర్ ముందున్న ఆప్ష‌న్లు చూస్తే..

1.  త‌మ పార్టీలోకి వ‌చ్చేలా ప్రోత్స‌హించ‌టం

2. అది కుద‌ర‌దంటే.. తాజా ఎన్నిక‌ల వ‌ర‌కూ మ‌ద్ద‌తు ప‌లికేలా ప్ర‌య‌త్నించ‌టం

3. ఇదేమీ లేకుండా ఓటింగ్ కు గైర్హాజ‌రు అయ్యేలా చూడ‌టం

ఈ మూడు ఆప్ష‌న్ల‌లో కేసీఆర్ దేని వైపు మొగ్గు చూపుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే.. కేసీఆర్ కోరుకున్న‌ట్లుగా జ‌ర‌గాలంటే మూడు అంశాల్లో ఏదో ఒక‌టి జ‌ర‌గాలి. అలా జ‌ర‌గాలంటే ఏదో ఒక ప్రోత్సాహం అందించాల్సిందే. నిద్ర లేచింది మొద‌లు నీతులు చెప్పే వేళ‌.. ఇలా ప్రోత్స‌హించ‌టం దేని కింద వ‌స్తుందన్న‌ది ప్ర‌శ్న‌. ఇలాంటి వాటిని కేసీఆర్ ఎదుట ప్ర‌శ్నించే ధైర్యం చాలావ‌ర‌కూ లేదు. ఒక‌వేళ ఉన్నా.. ఎట‌కారంతో మ‌ళ్లీ ప్ర‌శ్న అడ‌గ‌కుండా చేసే నేర్పు ఆయ‌న‌కు ఉంది కాబ‌ట్టి.. ఇప్ప‌ట్లో ఆయ‌న ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం రాక‌పోవ‌చ్చు.



Tags:    

Similar News