పోలీసుల‌తో తప్ప ప‌నికాద‌ని డిసైడైన కేసీఆర్‌

Update: 2017-06-12 08:48 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు పోలీసులన్నా - పోలీసు శాఖ అన్నా ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి ఉన్న సంగ‌తి తెలిసిందే! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత పోలీసు శాఖ‌కు సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్య‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. శాఖ‌ప‌రంగానే కాకుండా, అధికారాలు - అధికారుల విష‌యంలోనూ కేసీఆర్ కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. విద్యారంగాన్ని సంస్క‌రించ‌డానికి అన్న‌ట్లుగా ఐపీఎస్ అధికారి అయిన ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌ కుమార్‌ కు గురుకులాల బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అదే రీతిలో పౌరసరఫరాల శాఖకు సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ ను నియమించాక ఆ శాఖలో జరిగే అవినీతికి కళ్ళెం వేయగలిగామని భావ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. ఇదే రీతిలో మ‌రో శాఖ‌కు సైతం పోలీస్ బాస్‌ ను బాధ్యుడిని చేయాల‌నే ఆలోచ‌నలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ లోని అత్యంత ఖ‌రీదైన ప్రాంత‌మ‌నే మియాపూర్‌ లో ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు - సంస్థలకు రిజిస్ట్రేషన్‌ చేయించిన వైనం - జాతీయ స్థాయిలో అది వివాదంగా మారిన నేప‌థ్యంపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు తన కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారులు - రెవెన్యూ శాఖకు చెందిన అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించిన సీఎం కేసీఆర్ ఎటువంటి పరిస్థితిలోనూ అక్రమాలకు తావివ్వరాదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మియాపూర్‌ స్కాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్న సబ్‌ రిజిస్ట్రార్లను పెద్దఎత్తున బదిలీ చేయడంతోపాటు ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న మరో ముగ్గురిని ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు.

ఈ నేప‌థ్యంలో గురుకులాలు - పౌర స‌ర‌ఫరాల రీతిలో ఐపీఎస్ అధికారుల‌తో ముందుకుసాగాల‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్న‌ట్లు ప్రచారం సాగుతోంది. రెవెన్యూ శాఖలోని మిగతా విభాగాలకు కూడా ఐపీఎస్‌ లను నియమించి తద్వారా అక్రమాలను తుదముట్టించాలని ఆయన సంకల్పించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ శాఖను తన పరిధిలోకి తీసుకుని ప్రక్షాళన చేయాలని భావిస్తున్న కేసీఆర్‌ నాలుగైదు రోజుల్లో ఒక ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశంపై ప్రణాళికలను రూపొందించే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. కేవలం స్టాంపులు - రిజిస్ట్రేషన్‌ శాఖలోనే అధికారులపై కాకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే మిగతా శాఖలైన ఎక్సైజ్‌ - వాణిజ్య పన్నుల విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్న నిర్ణయానికి వచ్చారు. స్టాంపులు - రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి వేళ్ళూనుకుపోయిందని ఈ శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి పడుతోందని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఐఏఎస్‌ ల కంటే ఐపీఎస్‌ లకే ప్రాధాన్యం ద‌క్కుతుంద‌ని ప‌లువురు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News