సినీరంగంలోకి కేసీఆర్‌...ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా?

Update: 2019-08-12 04:28 GMT
తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత కే చంద్రశేఖ‌ర్ రావు త‌న‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. రాజ‌కీయ‌వేత్త‌గా - ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని త‌న‌దైన శైలిలో న‌డిపించిన నాయ‌కుడిగా - స్వ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా త‌న ముద్ర‌ను వేసుకున్న కేసీఆర్ ఇప్పుడు సినీ రంగంలోకి అడుగిడ‌నున్నారు. సుప్ర‌సిద్ధ సినీ ప్ర‌ముఖుడు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లకు ముందుకు వ‌స్తే...తాను నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఆ సినీ ప్ర‌ముఖుడు మ‌రెవ‌రో కాదు కె.విశ్వనాథ్. ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్‌ నగర్‌ లోని కే విశ్వనాథ్ నివాసానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు.  ఉన్నత విలువలతో కూడిన ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడు విశ్వనాథ్ ఆధ్వర్యంలో సమాజానికి మంచి సందేశం అందించే మరోచిత్రం రావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆకాంక్షించారు. విశ్వనాథ్ దర్శకుడైతే - నిర్మాణపరమైన విషయాలు తాను చూసుకుంటానని ప్ర‌క‌టించారు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - విశ్వనాథ్ మధ్య సినిమాలు - భాష - సాహిత్యం తదితర అంశాలపై గంటకు పైగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ``నేను మీ అభిమానిని. చిన్నప్పటి నుంచి మీ సినిమాలంటే చాలా ఇష్టం. మీరు తీసిన ప్రతి సినిమా చూశా. శంకరాభరణం అయితే 25 సార్లకు పైగా చూసి ఉంటా. దాదాపు అన్ని సినిమాలు అలాగే చూశా. సినిమా చూసిన ప్రతీసారి మిమ్మల్ని ఓసారి కలవాలనిపించేది. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది. మీరు తీసే ప్రతి సినిమా ఓ కావ్యం లాగా ఉంటుంది. మీరు సినిమాలను తపస్సుతో తీస్తారు. అందులో వాడే భాషగానీ - పాటలుగానీ - కళాకారుల ఎంపికగానీ - సన్నివేశాల చిత్రీకరణగానీ - సంభాషణలు గానీ ప్రతిదీ గొప్పగా ఉంటుంది. కుటుంబమంతా కూర్చుని చూసేలా ఉంటాయి. అందుకే ఇప్పటికీ వీలు దొరికితే మీ సినిమాలు చూస్తాను. మీపై ఉన్న అభిమానమే నన్ను మీ దగ్గరకి తీసుకొచ్చింది. మిమ్మల్ని కలవడం - మీతో మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని సీఎం అన్నారు. మీ సినిమాలు రాక పది సంవ‌త్స‌రాలు అవుతోంది. సందేశాత్మక - గొప్ప సినిమాలు ఈ మధ్య రావటంలేదు. మీరు మళ్ళీ సినిమా తీయాలి. సహాయకుల ద్వారా మీ మార్గదర్శకత్వంలో సినిమా తీద్దామంటే నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం. దయచేసి దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయండి`` అని కేసీఆర్ ప్ర‌తిపాదించారు.

కాగా, సీఎం కేసీఆర్ ప్ర‌తిపాద‌న‌పై విశ్వ‌నాథ్ ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించారు. తన అజ్ఞాత అభిమానిగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంటికి వచ్చివెళ్లారని అనంతరం విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్తూ.. సీఎం కేసీఆర్ తన ఇంటికి రావడం అంటే కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా ఉన్నదని చెప్పారు. సినిమాలో పాట నచ్చి తనను కలుస్తానని శనివారం రాత్రి ఫోన్‌ చేసి మాట్లాడారని తెలిపారు. తాను ఎలాంటి అనారోగ్యంతో బాధపడటం లేదన్నారు. సాహిత్య అభిరుచిని సీఎం తనతో పంచుకున్నారని చెప్పారు. సినిమాలు తీయాలని సీఎం కోరారు కదా.. సినిమాలు తీస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ఓపిక లేదని - సినిమాలు తీయలేనని సీఎంతో చెప్పానని అన‌డం కొస‌మెరుపు.


Tags:    

Similar News