తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కొత్త పంచాయ‌తీ

Update: 2017-02-03 09:00 GMT
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కొత్త పంచాయ‌తీ తెర‌మీద‌కు వ‌చ్చింది. తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌సంగించే వేదిక‌ను గ‌తంలో వ‌లే పాత అసెంబ్లీ భ‌వ‌నంలో నిర్వ‌హించాల‌నే తెలంగాణ రాష్ట్ర ప్ర‌తిపాద‌న‌తో తాజాగా ఇరు రాష్ర్టాల మ‌ధ్య చ‌ర్చోపచ‌ర్చ‌లు న‌డుస్తున్న‌ట్లు స‌మాచారం. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ చేసే ప్రసంగాన్ని పాతభవనంలో నిర్వహించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వంతో చర్చించి భవనాన్ని సిద్ధం చేయాలని అధికారులు సంకల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్త అసెంబ్లీ సమావేశ మందిరాన్ని తెలంగాణకు - పాత అసెంబ్లిని ఏపీకి కేటాయించిన విషయం విధితమే. గత మూడేళ్లుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారికి కేటాయించిన సమావేశ మందిరాల్లో అసెంబ్లీని - శాసన మండలి సమావేశాలను నిర్వహిస్తూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ చేసే ప్రసంగాన్ని పాత శాసన సభా మందిరంలో నిర్వహించేవారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా సమావేశాలను ఇక నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరపాలని ఆ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీ తాత్కాలిక సచివాలయం వెలగపూడి ఆవరణలోనే ఏపీ ప్రభుత్వం శాసనసభా - శాసన మండలి సమావేశం మందిరాలను ఏర్పాటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో బ‌డ్జెట్ స‌మావేశాల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ తెలంగాణ ప్ర‌భుత్వం తాజా ప్ర‌తిపాద‌న‌తో ఏపీ ప్ర‌భుత్వంతో చ‌ర్చిస్తోంది.

తెలంగాణలో ఫిబ్రవరి మూడో వారం లేదా అంతకన్నా ముందే బడ్జెట్‌ సమావేశాలు జరిపేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభా బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ చేసే ప్రసంగాన్ని ఏపీ ఆధీనంలో ఉన్న పాత శాసనసభా భవనంలో జరిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ శాసనసభా స్పీకర్‌ మధుసూదనాచారి - ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుతో చర్చించి ఆ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న పాత శాసనసభా మందిరాన్ని తమకు ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌ రావు ఈ అంశంపై లేఖ రాయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏపీ స్పీకర్‌ తో తెలంగాణ స్పీకర్‌ సంప్రదింపులు జరిపాక ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్పీ టక్కర్‌ తో తెలంగాణ సీఎస్‌ ఎస్పీసింగ్‌ మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రిపబ్లిక్‌ డే దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన విందు భేటీలో ఇరువురి సీఎంల మధ్య పాత శాసనసభా మందిరం అంశం చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రులు - ఉన్నతాధికారులతో చర్చించాక శాసనసభా భవనాన్ని ఇచ్చే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని గవర్నర్‌ సమక్షంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.

అయితే ఢిల్లిలోని ఏపీ భవన్‌ విభజన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఏపీ ప్రభుత్వం శాసనసభా భవనాన్ని ఇచ్చే అంశంపై అంత త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండకపోవచ్చని అంటున్నారు. విభజన చట్టంలోని 9 - 10 షెడ్యూల్డ్‌ లోని సంస్థలు - నిధులు విభజనపై తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహారిస్తోందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదని ఏపీ ప్రభుత్వం మండిపడుతున్న సంగతి తెలిసిందే. తమ ఆదీనంలో ఉన్న అసెంబ్లి పాతభవనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే 9 - 10 షెడ్యూల్డ్‌ సంస్థల విభజన - నిధుల కేటాయింపు అంశం నీరుగారే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం వేసే వలలో పడితే అనవసర సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని ఏపీ ప్రభత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే పాత అసెంబ్లీ భవనం ఇచ్చే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానికి ఉంటుందని, మరో ఏడేళ్లు ప్రభుత్వ ఆదీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు ఇవ్వకుండా జాగ్రత్తపడాలని భావిస్తున్నట్లు సమాచారం. సచివాలయంలోని ఏపీ ప్రభుత్వ కార్యాలయ భవనాలను తమకు ఇవ్వాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కోరిన సంగతి విధితమే. భవనాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సుముఖత వ్యక్తం చేశారని, తెలంగాణ ప్రభుత్వం తరపున వార్తలు వెలువడినప్పటికి ఏపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను నిద్వందంగా తిరస్కరించింది. సచివాలయం భవనాలను తాము ఉపయోగించుకోవడం లేదని, అయితే వాటిని ఇప్పట్లో తెలంగాణకు ఇచ్చే అంశమేది పరిశీలనలో లేదని గతంలోనే ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీ ఆదీనంలో ఉన్న పాత అసెంబ్లి భవనాన్ని తమకు ఇవ్వాలని చేస్తున్న ప్రతిపాదనపై ఏపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. తాము చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకోకపోతే బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు నిర్వహించే గవర్నర్‌ ప్రసంగాన్ని యదావిధిగా కొత్త అసెంబ్లి సమావేశం మందిరంలోనే నిర్వహించక తప్పదని తెలంగాణ‌ అసెంబ్లి అధికారులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News