ఫేస్‌ బుక్ సీఈఓ మ‌న‌సు మార్చిన కేర‌ళ కుట్టి

Update: 2018-05-05 03:47 GMT

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌ బుక్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డైరెక్టుగా కావ‌చ్చు..ఇండైరెక్టుగా కావ‌చ్చు కానీ... అందులో మ‌న కేర‌ళ అమ్మాయికి పాత్ర ఉంది అని అంటున్నారు. అలా అని ఆ అమ్మాయి అందులో కీల‌క స్థానంలో ప‌ని చేస్తున్న ఉద్యోగి అనుకునేరు. కాదు. కేవ‌లం త‌న ఆలోచ‌న‌తో ఓ పోస్ట్ పెట్టింది. అదే స‌మ‌యంలో ఫేస్‌ బుక్ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంత‌కూ ఏంటా అమ్మాయి చేసిన ప‌ని...ఫేస్‌ బుక్ తీసుకున్న నిర్ణ‌యం ఏంటి అంటే...కేరళలోని మల్లపురానికి చెందిన జ్యోతి కేజీ (28) అనే యువతి తనకు సరైన జీవిత భాగస్వామి కావాలంటూ ఫేస్‌ బుక్‌ లో ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. తన ఫొటో - చిరునామా - మొబైల్ నంబర్ కూడా తెలియజేస్తూ గత నెల 26న పోస్ట్ చేశారు. దీనికి పెద్ద ఎత్తున స్పంద‌న వ‌చ్చింది. అయితే త‌న వివాహ ఆస‌క్తిని వెల్ల‌డించ‌డంతోనే జ్యోతీ కేజీ ఆగిపోలేదు. ఫేస్‌ బుక్ సీఈవో మార్క్ జుకర్‌ బర్గ్‌ కు వ్యక్తిగతంగా లేఖ కూడా రాశారు.

త‌న పెళ్లి ప్ర‌తిపాద‌న గురించి వివ‌రిస్తూ...తల్లిదండ్రులు మరణించారని - కుల మతాలతో - జ్యోతిష్యంతో పట్టింపు లేదని జ్యోతి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్‌ లో బీఎస్సీ పూర్తి చేసిన తనకు ఒక సోదరుడు - సోదరి ఉన్నారని వివరించారు. ఆమె పోస్ట్ వైరలైంది. ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆరు వేల మందికి పైగా షేర్ చేశారు. వారిలో కొందరు పురుషులు వివాహం చేసుకుంటామని ప్రతిపాదించగా - మిగతా వారు ఆశీస్సులు అందజేశారు. ఇక మార్క్ జుక‌ర్ బ‌ర్గ్‌ కు ఆమె ఏమ‌ని లేఖ రాసిందంటే...వివాహ సంబంధాల కోసం నిర్వహిస్తున్న వెబ్‌ సైట్లు - మధ్యవర్తుల దోపిడీ నుంచి ప్రజలను రక్షించేందుకు మ్యాట్రిమోనియల్ సర్వీసులు నడుపాలని కోరింది. మ్యాట్రిమోనియల్ సర్వీసులు ప్రారంభించాలని లేఖ రాసిన జ్యోతి అభ్యర్థనను మార్క్ జుకర్‌ బర్గ్ మన్నించినట్లే ఉన్నారు. త్వరలో సోషల్ మీడియా వేదికపై టిండర్ తరహాలో నూతన డేటింగ్ యాప్ ప్రారంభించనున్నట్లు జుకర్‌బర్గ్ ప్రకటించారు. దీంతో ఈ కేర‌ళ అమ్మాయి వ‌ల్లే జుక‌ర్‌ బ‌ర్గ్ ఆలోచ‌న‌లో ప‌డ్డాడా అనే చ‌ర్చ కూడా న‌డుస్తోంది.


Tags:    

Similar News