ఓరి నాయ‌నో.. సీఎం పోస్టు అంత చీపైపోయిందా?

Update: 2018-11-30 04:53 GMT
ఇప్ప‌టివ‌ర‌కూ నాలుగైదు ఎన్నిక‌లు చూస్తున్న వారంతా ఇప్పుడు విస్మ‌యానికి గుర‌వుతున్న ప‌రిస్థితి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాస్తా రెండు ముక్క‌ల‌య్యాక జ‌రుగుతున్న రెండో అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఒక‌టి కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. సింగిల్ డిజిట్ సీట్లు దాటేందుకు అవ‌కాశం లేని నేత‌లు సైతం తాము సీఎంలు అవుతామ‌న్న మాట‌ను చెప్ప‌టం క‌నిపిస్తోంది.

 ఏ ధీమాతో ఆ మాట చెబుతున్నార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రో సిత్ర‌మైన విష‌యం ఏమంటే.. ఇలా ముఖ్య‌మంత్రి క‌ల‌ల్లో ఉన్న నేత‌లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ రెండు పార్టీలు కేసీఆర్‌కు ప్ర‌త్య‌క్షంగానో.. ప‌రోక్షంగానో స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారే కావ‌టం విశేషం.

మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ సోద‌రుడు అక్బ‌రుద్దీన్ ఓవైసీ సంగ‌తే చూద్దాం. ఈ మ‌ధ్య‌న ఆయ‌న మాట‌ల జోరు అంత‌కంత‌కూ పెరుగుతోంది. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడుతున్న ఆయ‌న మాట‌లు కోట‌లు దాటుతున్నాయి. నోరు పారేసుకుంటున్న నేత‌ల్లో ఆయ‌న టాప్ త్రీలో ఉంటారు. ముఖ్య‌మంత్రులు ఎవ‌రు కావాల‌న్న‌ది తాము డిసైడ్ చేస్తామ‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌ట‌మే కాదు.. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లైన రోజున తామెంత సూప‌ర్ ప‌వ‌ర్ అన్న‌ది చేత‌ల్లో చూపిస్తామ‌ని చెబుతున్నారు. తాము డిసైడ్ చేసినోళ్లే సీఎం అని చెబుతున్నారు.

ఇన్ని మాట‌లు చెబుతున్న అక్బ‌రుద్దీన్ ప్రాతినిధ్యం వ‌హించే మ‌జ్లిస్ కు ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చేది ఏడంటే ఏడు సీట్లు మాత్ర‌మే. డ‌బుల్ డిజిట్ దాట‌ని పార్టీ సైతం సీఎం ఎవ‌రుండాలో డిసైడ్ చేస్తామ‌న్న మాట‌లు చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. సిట్టింగ్ స్థానాలు మొత్తాన్ని సైతం చేజిక్కించుకుంటారో?  లేదో? అన్న సందేహం ఉన్న బీజేపీ ప‌రిస్థితి మ‌రింత ఆస‌క్తిక‌రం. ఎట్టి ప‌రిస్థితుల్లో గెలుస్తార‌న్న ధీమాగా చెప్పే అభ్య‌ర్థి ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా లేర‌న్న మాట‌ తెలంగాణ బీజేపీ అభ్య‌ర్థుల విజ‌య‌వ‌కాశాల్ని విశ్లేషిస్తున్న వారు చెబుతున్న మాట ఇది.

ఇందుకు భిన్నంగా అంబ‌ర్ పేట బ‌రిలో ఉన్న బీజేపీ అభ్య‌ర్థి కిష‌న్ రెడ్డి మాత్రం త‌న గెలుపు పైన ధీమా వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. తాను తెలంగాణ‌కు కాబోయే సీఎం అని చెప్పుకోవ‌టం విశేషం.  సీఎం కావ‌టానికి మెజార్టీ ఎమ్మెల్యేల అవ‌స‌రం లేద‌న్న మాట‌ను చెప్పిన  కిష‌న్ రెడ్డి.. మెజార్టీ లేని నేత‌లే ముఖ్య‌మంత్రులు.. ప్ర‌ధాన‌మంత్రులు అయ్యార‌ని.. బీజేపీ గెలిస్తే తెలంగాణ సీఎం తానేన‌ని కిష‌న్ రెడ్డి చెప్పుకోవ‌టం గ‌మ‌నార్హం. ఎంత సీఎం ప‌ద‌వి అయితే మాత్రం అంత చీప్ గా తీసి పారేయ‌టం స‌రికాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News