కేటీఆర్ ట్వీట్ల గుట్టు విప్పిన కిష‌న్ రెడ్డి

Update: 2018-08-08 10:16 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టివ్‌ గా ఉండే సంగ‌తి తెలిసిందే. ట్విట్టర్ ద్వారా త‌న అనుచ‌రుల‌ను - వివిధ వ‌ర్గాల వారిని ఆయ‌న చేరువ అవుతున్నారు. స‌ర‌దా అంశంపై స్పందించ‌డం అయినా...స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషిచేయ‌డ‌మైనా...ట్విట్ట‌ర్ వేదిక‌గానే కేటీఆర్ కానిచ్చేస్తుంటారు. ఇలా ఓ ప్ర‌త్యేక‌త‌ను సాధించిన మంత్రి కేటీఆర్‌ పై బీజేపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నాయ‌కుడు జి.కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించే తీరు వెనుక ప‌ర్స‌న‌ల్ అజెండా ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న‌కు న‌చ్చే వాటి ప‌ట్ల త‌ప్ప నిజ‌మైన స‌మ‌స్య‌ల ప‌ట్ల ఆయ‌న స్పందించ‌డం లేద‌ని కిష‌న్ రెడ్డి ఆరోపించారు.

పార్టీ కార్యాల‌యంలో కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ నిజ‌మైన స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం త‌క్కువ అని కొన్ని స‌మ‌స్య‌లపై ఏదో నామ‌మాత్రంగా స్పందించి ఆయ‌న ఏదో చేస్తున్న‌ట్లుగా ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని అన్నారు. త‌న అనుచ‌రుల ట్వీట్ల‌కు మాత్ర‌మే ఆయ‌న రియాక్ట్ అవుతున్నార‌ని - నిజ‌మైన స‌మ‌స్య‌ల ప‌ట్ల ఆయ‌న స్పంద‌న లేద‌ని వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్‌ లో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని తెలిపిన కిష‌న్ రెడ్డి ఈ విష‌యంలో ఎంద‌రో మంత్రి కేటీఆర్‌ - ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా...ప‌రిష్కారం లేద‌ని ఆరోపించారు. ఆన్‌ లైన్‌ లో తామెంతో చేశామ‌ని చెప్పుకొనే బ‌దులుగా క్షేత్ర‌స్థాయిలోకి వ‌చ్చి చూస్తే అస‌లు విష‌యాలు తెలుస్తాయ‌ని కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా, యాదగిరిగుట్టలో వ్యభిచారం ఉదంతం బయటకు రావడం కిషన్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. రెండో తిరుపతిగా పేరు పొందిన ఈ పుణ్య‌క్షేత్రంలో పసిపిల్లలను ఈ రొంపిలోకి దింపి వ్యభిచారం చేయించడం క్షమించరాని నేరమ‌ని ఆయ‌న అన్నారు. దళారుల నుండి పిల్ల‌ల‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోందని, పిలల్లకు హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తున్నారని తెలిసి బాధను వ్యక్తం చెయ్యని వారుండరని కిష‌న్ రెడ్డి అన్నారు. ``నేరాలు అదుపులోకి తెచ్చాము..దేశంలోనే పోలీస్ వ్యవస్థ చురుకుగా ఉంది అని ప్రభుత్వం అంటోంది షీ టీమ్స్ అని ప్రచారం చేసుకుంటోంది. ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు కాబట్టే ఈ ముఠాలు వ్యాపారం చేస్తున్నాయి. కిడ్నాప్ - అపహరణ కేసులను తూతూ మంత్రంగా వదిలేస్తున్నారు. యాదగిరిగుట్టలోనే కాదు ఇంకా అనేక చోట్లలో జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థలు - సేవాశ్రమాల పేరుతో కూడా జరుగుతున్నాయి`` అని కిష‌న్ రెడ్డి ఆరోపించారు.
Tags:    

Similar News