ఆయన వ్యాపారాలన్ని అంబానీ చేతికి వచ్చేస్తున్నాయా?

Update: 2020-08-29 11:50 GMT
కిశోర్ బియానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆలోచనల పుట్టగా కార్పొరేట్ ప్రపంచంలో సుపరిచితుడైన ఆయన.. మిగిలిన వారికి భిన్నంగా తన బ్రాండ్లతో సామాన్యులకు సైతం బాగా దగ్గరయ్యారని చెప్పాలి. బిగ్ బజార్ తో పాటు పలు రిటైల్ చైన్ వ్యాపారాలున్న ఫ్యూచర్ ఎంటర్ ప్రైజస్ ను రిలయన్స్ కు అప్పజెప్పేస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని.. అన్ని అనుకున్నట్లు సాగితే.. తక్కువ వ్యవధిలోనే ప్యూచర్ గ్రూపు.. రిలయన్స్ చేతుల్లోకి వెళ్లిపోనున్నట్లు చెబుతున్నారు.

ఇదే జరిగితే.. భారత రిటైల్ రంగంలో రిలయన్స్ రిటైల్ వాటా భారీగా పెరిగిపోవటం ఖాయమని చెప్పక తప్పదు. ఫ్యూచర్ గ్రూపును రిలయన్స్ లోకి తీసుకొచ్చే ఈ భారీ డీల్ విలువ రూ.29వేల కోట్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఇంతకీ కిశోర్ బియానీ తన వ్యాపారాల్ని అంబానీ చేతుల్లోకి ఎందుకు పెడుతున్నారు? గ్రూపును ఎందుకు అమ్మేస్తున్నారు? అన్న విషయంలోకి వెళితే.. తనకున్న భారీ అప్పుల నుంచి బయటపడేందుకేనని చెబుతున్నారు.

ఆయనకు దగ్గర దగ్గర రూ.13వేల కోట్ల మేర రుణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మారిటోరియం ఉండటంతో ఊపిరిపీల్చుకుంటున్న ఆయన.. తర్వాతి కాలంలో ఇబ్బందులు తప్పవంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే తనకున్న బ్రాండ్లలో కొన్నింటికి అమ్మకానికి పెట్టిన బియానీ.. తాజాగా తన గ్రూపును రిలయన్స్ కు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

తాజా డీల్ కానీ ఓకే అయితే.. దేశంలో అతి పెద్ద రిటైల్ చైన్ గా మారుతుంది. రిటైల్ రంగంలో తనను తాను మార్కెట్ లీడర్ గా ఆవిర్భవించాలన్న కల.. ఈ డీల్ తో తీరనుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.63 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిన రిలయన్స్ రిటైల్ కు ఫ్యూచర్ గ్రూపుతో ఒప్పందం పూర్తి అయితే.. దేశంలోని సంస్థాగత రిటైల్ మార్కెట్లో మూడో వంతు కంటే ఎక్కువ మార్కెట్ వాటా లభించనుంది. అంతేకాదు.. తన తర్వాతి టార్గెట్ అయిన అమెజాన్ కు గట్టి పోటీ ఇచ్చే వీలుంది. అందుకే.. ఈ డీల్ ను పూర్తి చేయాలని రిలయన్స్ భావిస్తోంది
Tags:    

Similar News