చిత్తూరులో చివరకు ఏం జరగబోతోంది ??

Update: 2018-08-23 01:30 GMT
ఏపీలో రాజకీయాలు ఇంట్రస్టింగ్‌ గా మారుతున్నాయి. సీఎం సొంత జిల్లా చిత్తూరులోని పీలేరు నియోజకవర్గ రాజకీయమైతే మరింత రసవత్తరంగా మారింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం పీలేరు. 2009లో ఇక్కడి నుంచి గెలిచిన ఆయన ఆ తరువాత కొంతకాలానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు కూడా. అయితే.. 2014లో రాష్ట్ర విభజన తరువాత కిరణ్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చేసి జైసమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. పీలేరు నుంచి ఆయన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి చింతల రామచంద్రరెడ్డి గెలిచారు. కిశోర్ కుమార్ రెడ్డి ఓడిపోయినా 33 శాతం ఓట్లు సాధించారు. అయితే.. అన్న కిరణ్ పార్టీ జైసమైక్యాంధ్ర సోదిలో లేకుండా పోవడంతో కొన్ని నెలల కిందట కిశోర్ తెలుగుదేశం పార్టీలో చేరారు.
   
అయితే.. కొద్దిరోజుల కిందట కిరణ్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఇక్కడ టీడీపీ - కాంగ్రెస్ ల నుంచి వీరు పోటీ చేస్తారని.. అన్నదమ్ముల మధ్య పోటీ తప్పదని అంతా భావించారు. టీడీపీ టిక్కెట్ తనకేనని... ఇతర పార్టీల నుంచి ఎవు పోటీ చేసినా తాను వారిపై పోటీకి సిద్ధమేనంటూ ఇటీవల కిశోర్ అనడం కూడా అన్నదమ్ముల పోటీని సూచనప్రాయంగా తెలిపింది.
   
అయితే.. కిరణ్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయకపోవచ్చని.. ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టొచ్చని సమాచారం. ఈ సంగతి కిశోర్‌ కు కూడా తెలుసని.. అందుకే అన్నపై పోటీకి సిద్దమంటూ ఉత్తుత్తి హడావుడి చేస్తున్నారని అంటుననారు. అసలు కిశోర్ ను టీడీపీలోకి పంపించిందే కిరణ్ అని.. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నా వారి మధ్య సంబంధాలు ఏమాత్రం చెడలేదని చెబుతున్నారు.
   
మరోవైపు తాజాగా టీడీపీ - కాంగ్రెస్ పార్టీలు పొత్తు దిశగా కదులుతుండడంతో పీలేరు నియోజకవర్గ రాజకీయంలో జనం ఊహించినంత సెన్సేషన్ ఏమీ ఉండబోదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News