ప్ర‌తి దానికి గ‌వ‌ర్న‌రేనా కోదండం సారూ!

Update: 2018-08-28 11:26 GMT
తెలంగాణ ఉద్య‌మం టైంలో కోదండం మాష్టారి మాట‌లు తూటాల లెక్క‌న పేలేవి. ఆయ‌న నోరు విప్పితే చాలు.. ఆంధ్రా దురహంకార‌మ‌నో.. ఆంధ్రా పాల‌కుల‌నో.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేవారు. ఉద్య‌మం చేసే వేళ‌.. ఆ మాత్రం ఆవేశ ప‌డ‌టం త‌ప్పేం కాద‌న్న‌ట్లుగా చాలామంది మారు మాట్లాడేవారు కాదు.

తెలంగాణ వ‌స్తే చాలు.. త‌మ వాళ్ల పాల‌న‌లో ధ‌ర్మం నాలుగు కాళ్ల మీద న‌డుస్తుంద‌ని.. తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాలు మొత్తంగా మారిపోతాయ‌ని చాలానే మాటలు చెప్పేటోళ్లు. ఆయ‌న నోటి నుంచి మాటే మంచి ముత్యంగా భావించిన మీడియావాళ్లు సైతం ఆయ‌న మాట‌ల్ని బ్యాన‌ర్లుగా వేసేవి. కోదండం మాష్టారికి కోపం వ‌చ్చి కాలు బ‌లంగా భూమిని తాకిస్తే చాలు.. మొద‌టిపేజీలో తాటికాయంత అక్ష‌రాల‌తో ఆయ‌న ఆగ్ర‌హం త‌న్నుకొచ్చిన‌ట్లుగా హెడ్డింగులు పెట్టి మ‌రీ ప‌బ్లిష్ చేసేటోళ్లు.

కోదండం సారు కోరుకున్న‌ట్లే తెలంగాణ వ‌చ్చేసింది. ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. నాలుగున్న‌రేళ్లు పాల‌న కూడా ముగిసింది. సిత్రం ఏమంటే.. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆయ‌న మాట మొద‌టిపేజీలో ప‌బ్లిష్ అయితే.. ఇప్పుడు అదే కోదండం మాస్టారు మాట్లాడితే.. సింగిల్ కాల‌మ్‌.. లేదంటే డ‌బుల్ కాల‌మ్ అది కూడా లోప‌ల‌కెక్క‌డో.. ఫోటో కూడా అచ్చు కాని ప‌రిస్థితి.

ఉమ్మ‌డి పాల‌కుల హ‌యాంలో ఆయ‌న మాట‌ల‌కు ఉండే ప్ర‌యారిటీకి.. ఇప్పటికి సంబంధం లేని ప‌రిస్థితి. అంతేనా..ఆయ‌న ఆంధ్రా దుర‌హంకార‌మ‌న్న మాట నోటి నుంచి వ‌స్తే.. ఆ మాట‌ల్ని వినిపించేందుకు బోలెడ‌న్ని టీవీ గొట్టాలు సిద్ధంగా ఉండేవి. వేల కోట్ల‌ను కేసీఆర్ స‌ర్కారు దోచుకుంటున్నార‌ని.. ఆయ‌న‌కు చంచ‌ల‌గూడ జైలు త‌ప్ప‌ద‌న్న భారీ మాట‌ను మాట్లాడినా.. మీడియాలో భూత‌ద్దం వేసుకొని చూస్తేకానీ క‌నిపించ‌ని ప‌రిస్థితి.

ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న ప్ర‌యారిటీ మొత్తంగా పోవ‌ట‌మే కాదు.. చివ‌ర‌కు స‌భ పెడ‌తానంటే ప‌ర్మిష‌న్ ఇచ్చేందుకు స‌సేమిరా అనేస్తున్న ప‌రిస్థితి. తీరా స‌భ‌కు అనుమ‌తి దొరికినా స‌వాల‌చ్చ ఆటంకాలు.. ప‌రిమితులు. వీటితో వ‌చ్చిన ఫ‌స్ట్రేష‌నో మ‌రేమో కానీ.. సెప్టెంబ‌రు 2న కేసీఆర్ సారువారు ఏర్పాటు చేసే స‌భ‌కు స్కూల్ బ‌స్సుల్ని ఏర్పాటు చేస్తే.. తాము ఊరుకోమ‌ని.. కంప్లైంట్లు చేస్తామ‌ని.. కోర్టులో కేసులు వేస్తామ‌న్న మాట‌ను చెప్పారు. అయినా.. కోదండం మాష్టారి మాట‌ల్ని ఎవ‌రూ ప‌ట్టించుకోని ప‌రిస్థితి. ఇదంతా త‌న వ‌ల్ల కాద‌నుకున్నారో ఏమో కానీ.. స‌భ‌ను నిబంధ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లు నిర్వ‌హించాలంటూ అల్టిమేటం జారీ చేసి.. ఆ సంగ‌తుల‌న్ని గ‌వ‌ర్న‌ర్ సాబ్ చూడాల‌ని కోరారు.

అక్క‌డితో ఆగ‌ని కోదండం మాష్టారు తాజాగా.. సీఎం కేసీఆర్ ముంద‌స్తుకు వెళ్ల‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు. వాస్త‌వానికి విప‌క్షంలో ఉన్న వారు ఎన్నిక‌లంటే  మ‌హా ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించాలి. అదేం సిత్ర‌మో కానీ.. ఎన్నిక‌ల‌కు అధికార‌ప‌క్షం రెఢీ అంటూ ఉత్సాహ ప‌డుతుంటే.. విప‌క్ష నేత‌గా కోదండం మాష్టారు మాత్రం.. ముంద‌స్తు అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేనా.. హ‌డావుడిగా ఫైళ్లు ఎందుకు క్లియ‌ర్ చేస్తున్నారంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

ఎన్ని కోట్ల చేతులు మార‌తాయో.. ఫైళ్ల క్లియ‌రెన్స్ ఇష్యూలో గ‌వ‌ర్న‌ర్ సాబ్ జోక్యం చేసుకోవాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు. నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ ప్ర‌తి విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ సాబ్ చూసుకోవాల‌ని చెప్పుడేంది కోదండం సారూ.. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పాల‌క ప‌క్షాన్ని నిల‌దీయ‌టం.. తేడా చేస్తే క‌డిగి పారేయ‌టం వ‌దిలేసి..గ‌వ‌ర్న‌ర్ సారును అదే ప‌నిగా అన్ని చూసుకోమ‌న‌డేంది..?

Tags:    

Similar News