కోదండరాం: సీఎంలు కాదు జిల్లాలు శాశ్వ‌తం!

Update: 2016-09-20 13:22 GMT
జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాల‌నే డిమాండ్‌ తో సాగుతున్న జ‌న‌గామ‌ జనగర్జన సభలో తెలంగాణ రాజ‌కీయ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండరాం ప్ర‌భుత్వం - ముఖ్య‌మంత్రి కేసీఆర్ టార్గెట్‌ గా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. సమగ్ర చట్టం - నిపుణుల కమిటీ - ప్రతిపాదనలు లేకుండా జిల్లాలను ప్రకటించడం అన్యాయమ‌ని విమ‌ర్శించారు. జిల్లాల విభ‌జ‌న మూలంగా నిన్నటిదాక కలిసి ఉన్న వాళ్లం... ఇప్పుడు భిన్నాభిప్రాయాలతో విబేధించుకుంటున్నామ‌ని కోదండ‌రాం వ్యాఖ్యానించారు.  ప్రభుత్వం అభిప్రాయాలు పంచుకుంటే బాగుంటుదేమోన‌ని వ్యాఖ్యానించారు. ఒక‌వేళ అలా చ‌ర్చించ‌పోయిన‌ - గొంతు నొక్కినా జ‌న‌గామ జ‌న‌గ‌ర్జ‌న‌ సభ ఆగిపోదని కోదండరాం హెచ్చ‌రించారు.

సీఎంలు శాశ్వతం కాదు జిల్లాలు శాశ్వతమ‌ని కోదండ‌రాం ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఈ దసరా కాకపోతే ఉగాదికో అది కాకుంటే వ‌చ్చే దసరాకో జిల్లాలు విభజన చేయొచ్చున‌ని తొందరపాటుతో కాకుండా ముందుకుపోవ‌ద్ద‌ని కోదండ‌రాం సూచించారు. కొన్ని జిల్లాల ఏర్పాటు విష‌యంలో ప్ర‌భుత్వం మొండిగా ముందుకు పోతుంద‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఉన్న‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ భావ‌న‌ను పోగొట్టేలా చేయాల్సిన బాధ్య‌త పాల‌కుల‌పైనే ఉంద‌న్నారు.  ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ - నియమావళి ప్రకారం న‌డుచుకోవాలని ఆయ‌న పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని పార్టీలు కొత్త జిల్లాల ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌ను గుర్తించి ప్ర‌జ‌ల ప‌క్షాన‌ మాట్లాడాలని కోదండ‌రాం కోరారు.
Tags:    

Similar News