ఆరోప‌ణ‌లు చేసిన వారిపై మాష్టారి క‌న్నెర్ర‌

Update: 2017-03-07 10:07 GMT
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ముందుకు సాగుతున్న జేఏసీలో లుక‌లుక‌ల‌పై చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం క‌న్నెర్ర చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ప్పిదాల‌ను ఎండ‌గ‌ట్టే దిశ‌గా తాము ముందుకు సాగుతుంటే జేఏసీ స‌భ్యులే విమ‌ర్శ‌లు చేయ‌డంపై ఆగ్ర‌హించిన కోదండ‌రాం  వారంద‌రిపై స‌స్పెన్ష‌న్‌ వేటు వేశారు. కోదండ‌రాం సార‌థ్యంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ స్టీరింగ్ కమిటీ తాజాగా హైద‌రాబాద్‌ లో  సమావేశమైంది. ఇందులో భాగంగా ఇటీవ‌ల జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాంపై విమ‌ర్శ‌లు చేసిన ఐకాస ముఖ్య నేత‌లు పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్ ల‌ను టీజేఏసీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నిర్ణ‌యం వెలువ‌రించింది.

ఈ సంద‌ర్భంగా జేఏసీ వ‌ర్గాలు మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ నిరసన ర్యాలీ విజయవంతం కావడం-జేఏసీ ప్రజల బలమైన గొంతుకగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని పాలకులు తమ కుట్రలను తీవ్రతరం చేశారని ఆరోపించారు. ప్రశ్నించే శక్తులు లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే కొంతమందిని ప్రలోభానికి గురిచేసి, ప్రజలలో గందరగోళాన్ని సృష్టించడానికి ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలు తిప్పికొట్టాలని జేఏసీ నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రలోభాలకు లోబడి కొందరు చేస్తున్న ప్రకటనల వల్ల జేఏసీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని, వీటివల్ల జేఏసీ తన కార్యాచరణను మరింత బలంగా ప్రజలలోకి తీసుకుపోవడానికి అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కరించే బదులు , ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న శక్తులను అధికార దుర్వినియోగానికి పాల్పడి, అనైతిక పద్ధతుల ద్వారా బలహీన పరచాలనుకోవడం అవివేకమ‌ని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామిక విలువల పట్ల కనీస గౌరవమున్న వాళ్ళు చేసే పని కాదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణిని ఖండిస్తున్నామ‌ని, ఆ కుట్రలకు చేయూత నిస్తున్న పిట్ట‌ల ర‌వీంద‌ర్‌, ప్ర‌హ్లాద్‌ల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా మ‌రిన్ని నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇవే ఈ నిర్ణ‌యాలు....

1.కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీ ఫీజులు అడ్డు , అదుపు లేకుండా పెరగడం వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతుంది. ప్రభుత్వం  ఫీజుల నియంత్రణకోసం ప్రస్తుత చట్ట పరిధిలో తీసుకోవాల్సిన ఏ చర్యలూ తీసుకోవడంలేదు. ఈ నేపథ్యంలో ఫీజుల నియంత్రణకు కార్యాచరణ చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది.

2. బడ్జెట్ ను అధ్యయనం చేసి బలహీన వర్గాలకు కేటాయించిన నిధుల తరలింపును వెలుగులోకి తేవాలని తీర్మానించింది.

3.ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లాల యాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన తేదీలు త్వరలో ప్రకటిస్తాం.

4. నిరుద్యోగ నిరసన ర్యాలీ తదనంతర పరిణామాలపై టీజేఏసీ చ‌ర్చించిన త‌ర్వాతే స‌స్పెన్ష‌న్ వేటు వేయాల‌ని నిర్ణ‌యించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News