కాసులు కురిపించిన కోకాపేట.. ఎకరం రూ.60.2 కోట్లు

Update: 2021-07-16 04:34 GMT
పాత రికార్డులు బద్ధలయ్యాయి. అంచనాలకు మించి సాగిన బిడ్డింగ్ తెలంగాణ బొక్కసానికి కోట్లు రూపాయిల కాసుల వర్షం కురిసేలా చేసింది. ఇప్పటివరకు ఎప్పుడూ లేనట్లుగా కోకాపేటలో వేసిన వేలం సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసి.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (పొట్టిగా చెప్పాలంటే హెచ్ఎండీఏ) కోకపేటలోని 49.94 ఎకరాల భూమిని ఆన్ లైన్ ద్వారా వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ వేలానికి ముందు చాలానే అంశాలు తెర మీదకు వచ్చాయి. ఈ వేలాన్ని నిలిపివేయాలన్న ఆందోళనలు.. కోర్టును ఆశ్రయించటం లాంటివి చోటు చేసుకున్నాయి. అయితే.. వాటన్నింటిని దాటుకొని శుక్రవారం జరిగిన ఆన్ లైన్ వేలంలో ఒక ప్లాట్ లోని ఎకరం భూమి ఏకంగా రూ.60.2 కోట్ల మొత్తానికి కోట్  చేయటం ద్వారా కొత్త రికార్డును క్రియేట్ చేసిందని చెప్పాలి. ప్రభుత్వం ఎకరానికి అప్ సెట్ ప్రైస్ గా రూ.25 కోట్లను కేటాయించింది. ఇంత భారీగా ధరను కోట్ చేస్తారా? అన్న మాట వినిపించినా..కోకాపేట భూమికి ఆ మాత్రం ధర నిర్ణయించటం తప్పేం కాదన్న మాట వినిపించింది.

ఆన్ లైన్ వేలానికి సమయం దగ్గరకు వచ్చేసరికి.. వేలంలో ఎకరం రూ.35కోట్ల వరకు వెళుతుందని.. రూ.40 కోట్లు దాటదన్న అంచనాలు వినిపించాయి. అందుకు భిన్నంగా ఒక ఎకరం భూమి ఏకంగా రూ.60 కోట్లు పలకటం ఇప్పుడు రియల్ ఎస్టేల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంచనాలకు భిన్నంగా కళ్లు చెదిరే ధరలతో ప్లాట్లు అమ్ముడయ్యాయి.

మొత్తం 49.94 ఎకరాలకు ఏకంగా రూ.2వేల కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరనుండటంతో.. రానున్న రోజుల్లో మరిన్ని భూములు అమ్మేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమవుతుందన్న మాట వినిపిస్తోంది.

తాజాగా నిర్వహించిన వేలంలో ఏడు ప్లాట్లు నియోపోలీస్ లేఅవుట్ వి కాగా.. ఒక ప్లాట్ గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు సంబంధించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 30.77 ఎకరాలతో కూడిన నాలుగుప్లాట్లు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిగిలిన 19.17 ఎకరాల నాలుగు ప్లాట్లకు వేలం జరిగింది. ఇందులో 1.65 ఎకరాలున్న ప్లాట్ కు.. ఎకరానికి రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్ తో రూ.99.33 కోట్లను వెచ్చించి రాజపుష్ప రియాల్టీ సంస్థ ప్లాట్ ను దక్కించుకుంది. దీంతో.. ఇప్పుడు ఆ సంస్థ హాట్ టాపిక్ గా మారింది.

మొత్తంగా చూస్తే.. కోకాపేట వేలం విషయంలో గరిష్ఠంగా ఎకరం రూ.60.2 కోట్లు పలికితే.. కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలికింది. సరాసరిన చూస్తే.. సగటున ఒక్కో ఎకరం రూ.40.05 కోట్ల మొత్తానికి అమ్ముడైంది. ఈ వేలానికి ముందు.. ఇందులో ఉత్తరాదికి చెందిన కంపెనీలు.. ఫార్మా సంస్థలు భూముల్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వేలంలో ప్లాట్లను దక్కించుకున్న వారంతా తెలుగు వారే కావటం ఆసక్తికరంగా మారింది. అయితే.. ముందుగా వినిపించిన అంచనాలకు తగ్గట్లే.. వేలంలో దాదాపు 60 మంది దేశీయ.. విదేశీ బిడ్డర్లు పాల్గొన్నట్లుగా హెచ్ఎండీఏ తెలిపిందే.

తాజా వేలం తర్వాత హెచ్ఎండీఏ నిర్వహించే భూముల వేలానికి భారీగా ఆదాయం రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. హెచ్ఎండీఏకు కోకాపేటలో 634 ఎకరాలు ఉన్నాయి. ఇందులో167 ఎకరాల్ని గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో.. 100 ఎకరాల్ని ఎంపైర్ 1గా అదే సమయంలో  ఎంపైర్ 2 పేరుతో 67 ఎకరాల్ని 2007లో వేలం వేశారు. అప్పట్లో ఎకరానికి అత్యధికంగా రూ.14.25 కోట్ల ధర పలికింది.

అయితే.. ఈ భూముల విషయంలో నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చి.. 2017లో ఈ భూములన్ని హెచ్ఎండీఏవేనని కోర్టు తేల్చింది. దీంతో.. వివాదం ముగిసి భూముల వేలానికి రూట్ క్లియర్ అయ్యింది. వివిధ సంస్థలకు ఇచ్చిన భూముల్ని వదిలేస్తే.. ప్రస్తుతం 110 ఎకరాలు హెచ్ఎండీఏ చేతిలో ఉన్నాయి. ఇందులో తాజాగా 49.94 ఎకరాల్ని అమ్మకానికి పెట్టారు.

మిగిలిన భూమిని త్వరలోనే అమ్మకానికి పెట్టే వీలుందన్న మాట వినిపిస్తోంది. కోర్టు కేసుల కారణంగా భూముల అమ్మకం ఆలస్యమైనా.. అందుకు తగ్గట్లే భారీగా ఆదాయం రావటం ప్రభుత్వానికి కాసుల పంటగా మారిందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News