కేసీఆర్‌ కు కాలిపోయే మాట అన్న కోమ‌టిరెడ్డి

Update: 2018-08-02 08:50 GMT
తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్షానికి.. కాంగ్రెస్ పార్టీకి మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధం అంత‌కంత‌కూ ముదురుతోంది. నిన్న‌టికి నిన్న నిజామాబాద్ లో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు..కాంగ్రెస్ లో జానారెడ్డి.. ఉత్త‌మ్ త‌ప్పించి మిగిలిన వారంతా కారు ఎక్క‌టానికి ట్రై చేస్తున్నార‌ని..కానీ త‌మ కారులో జాగా లేద‌ని వ్యాఖ్యానించ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. తెలంగాణలో కేసీఆర్ క‌టుంబ స‌భ్యులు త‌ప్పించి.. మ‌రెవ‌రూ సంతోషంగా లేద‌ర‌ని.. తెలంగాణ వచ్చిన ఆనందం ఏ ఒక్క‌రిలోనూ లేద‌న్నారు.

శ్రీ‌వారి ద‌య‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంవృద్ధిగా వ‌ర్షాలు కురిసి ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉండాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే అంశంపై సీడ‌బ్ల్యూసీలో చేసిన తీర్మానాన్ని పూర్తిగా మ‌ద్ద‌తు ప‌లికారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఆయ‌న‌..విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న త‌మ పార్టీ నిర్ణ‌యాన్ని తాను స్వాగతిస్తున్న‌ట్లు చెప్పారు.

గ‌తంలో ఏపీకి హోదా ఇవ్వాలంటూ ఎంపీ క‌విత కూడా వ్యాఖ్యానించార‌ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌కు మిన‌హా మిగిలిన మంత్రులు ఎవ‌రికీ అధికారాలు లేవ‌ని మండిప‌డ్డారు. తెలంగాణ‌లో అభివృద్ది కాగితాల మీద‌నే త‌ప్ప వాస్త‌వంగా లేద‌న్నారు. త‌న మాట‌ల‌తో త‌ర‌చూ కేసీఆర్ ఫ్యామిలీపై విమ‌ర్శ‌లు సంధించే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తాజాగా చేసిన విమ‌ర్శ‌లు తెలంగాణ సీఎంకు మ‌రింత మంట పుట్టేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 

Tags:    

Similar News