కొణ‌తాల... ఇంకా క్వశ్చన్ మార్కేల?

Update: 2016-11-04 03:25 GMT
కొన్నాళ్లుగా క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న కొణ‌తాల రామ‌కృష్ణ‌ గతకొంతకాలంగా వార్త‌ల్లో కూడా కనిపించడం లేదు! అయితే వైకాపా నుంచి బయటకు రావడం, అనంతరం టీడీపీ లోకి వెళ్తున్నారని వార్తలు రావడం అనంతరం అంతా సైలంట్ గా ఉండటం తెలిసిందే. అయితే తాజాగా "ప్రత్యేక హోద" అంటూ వార్తల్లోకి వస్తున్నారు కొణతాల. ఈ క్రమంలో ఈనెల 9న అన‌కాప‌ల్లిలో చాయ్ చ‌ర్చా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. దీంతో ప్రత్యేక హోదాపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగించేందుకు టీ స్టాల్స్ లో చ‌ర్చ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. అయితే ఈ చాయ్ చర్చ పై రకరకాల సందేహాలు వస్తున్నాయి. సడన్ గా ప్రత్యేక హోదా అనే అంశం ఎత్తుకున్నారంటే... ఈ చర్చా కార్య‌క్ర‌మం కేవ‌లం ప్ర‌జ‌ల అవగాహ కోస‌మేనా.. లేక, రాజ‌కీయంగా కొణ‌తాల తీసుకునే నిర్ణయానికి ప్రజల స్పందనకు ఇది కారణం కాబోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంత‌కీ, కొణ‌తాల ఏ పార్టీ త‌ర‌ఫున ఈ చ‌ర్చ చేప‌డుతున్న‌ట్టు... ప్రభుత్వానికి (టీడీపీకి) వ్య‌తిరేకంగానా.. వైకాపాకి మ‌ద్ద‌తుగానా.. లేక, జ‌న‌సేన‌కు తోడుగానా.. అదీగాక బీజేపీ నిర్ణ‌యానికి ఖండ‌న‌గానా... ఈ విషయాలు త్వరలోనే తేలబొతున్నాయి. అయితే... ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల ప్రకారం ఎవరైనా "ప్రత్యేక హోదా" అనే అంశం లేవనెత్తితే వారిపై అభివృద్ధి నిరోదకులని ముద్రవేసేస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రత్యేక ప్యాకేజీ గొప్పతనం గురించి తప్ప... హోదా అనే ప్రస్థావన తీసుకొస్తే... అటు టీడీపీ - ఇటు బీజేపీ నేతలనుంచి ఒక్కసారిగా ఫైరింగ్ ఆర్డర్స్ విడుదలవుతున్నాయి.

కాబట్టి... ఈ క్రమంలో కొణతాల ప్రత్యేక హోదాపై అవగాహన అంటే అది కచ్చితంగా వైకాపాకు మద్దతుగా అనే ఒకరకమైన అభిప్రాయం ప్రజల్లోకి, ఇటు రాజకీయ వర్గాల్లోకి వచ్చే అవకాశం ఉందనేది పలువురి వాదన. అయితే... ప్ర‌స్తుతం ఏ పార్టీకి చెంద‌ని నాయ‌కుడిగా మిగిలిపోయిన కొణ‌తాల‌... వైయ‌స్ హ‌యాంలో ఆయ‌న‌కు వీరాభిమానిగా ఉండేవారు. అనంతరం జ‌గ‌న్ వెంట వెన్నుద‌న్ను కూడా నిల‌బ‌డ్డారు. ఒకానొక సమయంలో అయితే... వైకాపా నుంచి ఎంత‌మంది బ‌య‌ట‌కి వెళ్లిపోతున్నా... చివ‌రివ‌ర‌కూ ఉండేది కొణ‌తాలే అనికూడా అనుకున్నారు! ఇంతలోనే ఏమిజరిగిందో ఏమో... జ‌గ‌న్‌ కి కూడా దూర‌మ‌య్యారు.

అనంతరం టీడీపీలో చేరుతున్నారని, నాలుగైదు రోజుల్లో పచ్చ సింగల్ పడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అదీ జరగలేదు! అనంతరం కొంతకాలంగా సైలంటుగా ఉన్న కొణతాల... తాజాగా "ప్రత్యేక హోదా పై ప్రజలకు అవగాహన కల్పిస్తాను" అని సడన్ గా తెరపైకి రావడం కచ్చితంగా ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించేది కూడా అయ్యి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేదా... ఈ చాయ్ చర్చా కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి కూడా తీసుకునే నిర్ణయం ఆదారపడి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News