కోటాను చంపేయాలనుకున్న పొలిటీషియన్!!

Update: 2016-03-13 06:07 GMT
అవునా? కాదా? రెండే ముక్కల్లో చెప్పాలంటే మొదట అవుననే చెప్పాలి. కాకుంటే.. ఎందుకన్న ప్రశ్నకు సమాధానం కూడా వినాల్సిందే. తాజాగా ఒక ప్రముఖ పత్రిక కోటా శ్రీనివాసరావు ఇంటర్వ్యూ అచ్చేసింది. ఈ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు బోలెడన్ని కబుర్లు చెప్పారు. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. ఆయన నటించిన మోస్ట్ కాంట్రావర్షియల్ ఫిలిం మండలాధీశుడు చిత్రం గురించి ఆయన చాలానే విషయాలు చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ ను ఎండగడుతూ నాడు కృష్ణ తీసిన ఈ సినిమాకు సంబంధించి కోట చెప్పిన మాటల్లోని ముఖ్యాంశాల్ని చెప్పేస్తే..

‘‘నా కెరీర్ లో నేను మరిచిపోలేని చిత్రం మండలాధీశుడు. రామారావుగారికి వ్యతిరేకంగా కృష్ణగారు నిర్మించారు. ఈ సినిమాలో నటిస్తేఇబ్బందొస్తుందని ఊహించి చేయనన్నాను. కానీ.. కృష్ణగారు వదిలిపెట్టలేదు. ఆ సమయంలో ఆయన టాప్ హీరో. అరడజను సినిమాలు చేతిలో ఉండేవి. నీకేం భయం లేదయ్యా.. ఎవరు సినిమాలు ఇవ్వకపోయినా నా సినిమాలు చేద్దువు కానీ.. తర్వాత వాళ్లే తెలుసుకుంటారు అన్నారు’’

‘‘నువ్వు చేస్తానంటేనే ఆ సినిమా చేస్తా. లేకుంటే చేయను అన్నారు. ఆయన సోదరులు.. విజయనిర్మల ఒప్పించారు. మండలాధీశుడు ఒప్పుకోవటానికి మరో కారణం నేను నటించేది లైవ్ లో ఉన్న ఒక వ్యక్తికి సంబంధించింది. కళ్ల ముందే ఆ మనిషి ఉన్నారు. అలాంటి అవకాశం రాదని ఒప్పుకున్నా. అయితే.. ఆ వేషం వేయటం వల్ల జనం చేతిలో తన్నులు తినాల్సి వస్తుందని మాత్రం ఊహించలేదు’’

‘‘ఆ సినిమా విడుదలయ్యాక ఒక రోజు అప్పటి తెలుగుదేశం నాయకుడు దేవినేని నెహ్రు ఫోన్ చేశారు. ఆయనతో నాకు అంతకుముందే పరిచయం ఉండంతో అప్యాయంగా పలుకరించాను. రామారావుగారి కేరెక్టర్ చేసినందుకు నిన్ను చంపేయ్యాలనిపించింది. ఆ పని చేసే ముందు ఒకసారి సినిమా చూడాలనుకొని వెళ్లి చూశాను. అబ్బ.. ఏం చేశావయ్యా.. అన్నగారిని అద్భుతంగా అనుకరించావు. అదరగొట్టవయ్యా అనేశారు’’

‘‘కొన్ని రోజుల తర్వాత మద్రాసు ఎయిర్ పోర్ట్ లో రామారావుగారికి ఎదురుపడాల్సి వచ్చింది. అప్పట్లో ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో నటించి.. డబ్బింగ్ చెప్పటం కోసం మద్రాస్ వచ్చారు. నేను హైదరాబాద్ వెళ్లటం కోసం ఎయిర్ పోర్ట్ కి వెళ్లా. రామారావుగారికి స్వాగతం పలకటం కోసం రామానాయుడుగారు.. రాఘవేంద్రరావుగారు.. దేవివరప్రసాద్ గారు లాంటి సినిమా ప్రముఖులతో ఎయిర్ పోర్ట్ నిండింది. రామారావుగారిని కలిసి ఒక నమస్కారం చేయాలనిపించింది. అప్పుడు నా పక్కన విజయచందర్ ఉన్నారు. నా బ్యాగ్ చూడమని చెప్పి వెళుతుండగా.. ఎక్కడికి..బాత్రూమ్ కా అని అడిగారు. కాదు.. రామారావుగారిని కలవటానికి అని చెప్పా. ఉలిక్కిపడిన ఆయన.. దగ్గరికి వెళితే చంపుతాడయ్యా? అన్నారు. అయినా వినిపించుకోకుండా రామారావుగారి దగ్గరకు వెళ్లి నమస్కరించా. ఆయన పక్కనున్న వాళ్లంతా నా వంక కోపంగా చూస్తున్నారు’’

‘‘రామారావుగారు మొదట నన్ను గుర్తుపట్టలేదు. తర్వాత పరీక్షగా చూసి ఊ.. గుర్తుపట్టానయ్యా.. నీ గురించి విన్నా.. వండర్ ఫుల్ ఆర్టిస్ట్. మనమంతా ఆ నటరాజు బిడ్డలం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. గాడ్ బ్లెస్ యూ అని భుజం తట్టి వెళ్లిపోయారు. వెంటనే ఆయన కాళ్లకు నమస్కరించి.. పక్కకు వచ్చేశా’’
Tags:    

Similar News